Kothagudem: ప్రభుత్వ ఆఫీసులో కేక్ కటింగ్.. అధికారుల ఆగ్రహం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు మెంబర్ బర్త్‌డే వేడుకలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

G Ravi, Bhadradri
Published on: 17 May 2026 6:08 AM IST
Kothagudem
X

Kothagudem: ప్రభుత్వ ఆఫీసులో కేక్ కటింగ్.. అధికారుల ఆగ్రహం

Kothagudem: ప్రజా సమస్యల పరిష్కారానికి, అధికారిక పాలనా వ్యవహారాలకు వేదిక కావాల్సిన గ్రామ పంచాయతీ కార్యాలయం కాస్తా, ఒక వార్డు సభ్యురాలి జన్మదిన వేడుకలకు వేదికగా మారడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మూడవ వార్డు మెంబర్ తోకల నాగ ప్రవళిక జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకల వెనుక పంచాయతీలోని అంతర్గత రాజకీయాలు, సర్పంచ్-ఉపసర్పంచ్‌ల మధ్య నడుస్తున్న విభేదాల లొసుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తిగత వేడుకలా?

​సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయాలు కేవలం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాలకమండలి సమావేశాలు,ప్రజా సంక్షేమ చర్చల కోసమే వినియోగించాలి.ఏ ప్రజాప్రతినిధి అయినా సరే,తమ వ్యక్తిగత వేడుకలను, పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించడానికి వీల్లేదు.​కానీ బూర్గంపాడు పంచాయతీలో ఇందుకు విరుద్ధంగా, కార్యాలయం లోపలే టేబుల్ వేసి,కేక్ తెచ్చి, సబ్‌స్రైబర్ల సమక్షంలో వేడుకలు జరపడం నిబంధనల ఉల్లంఘనే అనే విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వ స్థలాన్ని వ్యక్తిగత ప్రచారానికి, వేడుకలకు ఎలా వాడుకుంటారంటూ స్థానికుల నుండి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

​ఉపసర్పంచ్ ‘ఆధ్వర్యం’... సర్పంచ్ ‘గైర్హాజరు’: విభేదాలు బట్టబయలు!

​ఈ బర్త్‌డే వేడుక కేవలం ఒక సాధారణ పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, పంచాయతీలో సాగుతున్న ఆధిపత్య పోరుకు నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ గుండె వెంకన్న స్వయంగా ముందుండి నడిపించడం, పాలకమండలిలోని తన వర్గం సభ్యులను కూడగట్టడం ఇక్కడ గమనార్హం.​ఇదే సమయంలో,

పంచాయతీ ప్రథమ పౌరుడైన సర్పంచ్ ఈ వేడుకకు దూరం కావడం విశేషం.గత కొంతకాలంగా బూర్గంపాడు పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందని టాక్. పాలనాపరమైన నిర్ణయాలు, నిధుల ఖర్చు, గ్రామాల్లో పనుల కేటాయింపుల విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే, సర్పంచ్‌కు చెక్ పెట్టేందుకే ఉపసర్పంచ్ వెంకన్న వార్డు మెంబర్లను తనవైపు తిప్పుకుంటూ, ఇలాంటి వేడుకల ద్వారా పంచాయతీపై తన పట్టును ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.​

ఈ వేడుకలో పాల్గొన్న కొందరు గ్రామస్తులు పాలకమండలి సభ్యులు వార్డు మెంబర్ ప్రవళిక సేవలను కొనియాడారు.కొత్త ఏడాదిలో ఆమె మరిన్ని ప్రజా సేవలు అందించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​సేవలు అందించాలనే ఆకాంక్ష బాగున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు గ్రూపులుగా విడిపోయి పంచాయతీ ఆఫీసులను రాజకీయ అడ్డాలుగా మార్చితే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందనే ఆందోళన బూర్గంపాడు ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సర్పంచ్ నాగరాజుతో దిశ మాట్లాడగా.. వార్డు మెంబర్ బర్త్ డే వేడుకలు గురించి ఎటువంటి సమాచారం లేదని, కనీసం పంచాయతీ కార్యదర్శి కూడా తన దృష్టికి తీసుకురాలేదని తెలిపారు. అలాగే ఎంపీడీవో జమలారెడ్డిని దిశ వివరణ కోరగా పంచాయతీ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల వేడుకలు ఇలా చేయకూడదని పేర్కొన్నారు. మరి ఈ ‘బర్త్‌డే పాలిటిక్స్’ పై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, సర్పంచ్-ఉపసర్పంచ్‌ల వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story