Kothagudem: చేతివృత్తుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ యోజన: మాజీ ఎంపీ!
Kothagudem: చేతివృత్తుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 'పీఎం విశ్వకర్మ యోజన' తెచ్చారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
Kothagudem: చేతివృత్తుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ యోజన: మాజీ ఎంపీ!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారుల అవగాహన సదస్సును జిల్లా కోఆర్డినేటర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... దేశంలోని చేతివృత్తుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టారని తెలిపారు. భారత పౌరుడై ఉండి, సంప్రదాయ చేతివృత్తుల్లో నైపుణ్యం కలిగి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా అందే శిక్షణ, పనిముట్లు, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ వృత్తులను అభివృద్ధి చేసుకోవడంతో పాటు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని సూచించారు.
జిల్లా కోఆర్డినేటర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ... పీఎం విశ్వకర్మ యోజనలో శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు కిట్‌లు లేదా ఇతర ప్రయోజనాలు అందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తనను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే సంబంధిత బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి సమస్యలను పరిష్కరించుకునే విధంగా సహకరిస్తామని తెలిపారు.
జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేలా చూడటం జిల్లా కోఆర్డినేటర్‌గా తన బాధ్యత అని అన్నారు. పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు ఎవరికి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, పథకం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్,జిల్లా నాయకులు సీతారాం నాయక్, జల్లారపు శ్రీనివాస్,రాయుడు నాగేశ్వరరావు, ఎడ్లపల్లి శ్రీనివాస్, నరసింహారావు, కనుకుంట్ల రాజమౌళి, తెలంగాణ క్రాంతి, బుక్య రాజేష్ నాయక్, గూడ విజయ, భూక్య పూర్ణ, గుమలాపురం సత్యనారాయణ, ఆదిమూల రాములు తదితరులు పాల్గొన్నారు.
అలాగే పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, పథకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు పాల్గొని పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.




