Khammam: పటిష్టమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి
Khammam: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం. పటిష్ట దర్యాప్తు, సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని అధికారులకు సీపీ సునీల్ దత్ ఆదేశం.
Khammam: పటిష్టమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి
ఖమ్మం: పటిష్టమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల సమర్పణతో నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేయాలని, తద్వారా బాధితులకు సత్వర, సముచిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...కేసుల ట్రయల్ ప్రక్రియలో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, విచారణ సమయంలో తలెత్తే లోపాలు, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు.
కేసులకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాధారాలు ఈ-సాక్ష్య యాప్‌లో నిబంధనల ప్రకారం నమోదు చేసి, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్ణీత గడువులో నాణ్యమైన ఛార్జ్షీట్లు న్యాయస్థానాల్లో దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి చెప్పారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన వైద్యం అందించి ప్రాణాలు రక్షించడంతో పాటు బాధిత కుటుంబంపై చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు అమలవుతున్న పీఎం రహత్ పథకం ద్వారా ప్రభుత్వం గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందిస్తు విషయాన్ని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా గంజాయి వినియోగదారులను పట్టుకున్న సందర్భాల్లో కేవలం వినియోగదారులకే పరిమితం కాకుండా, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తుల వివరాలను లోతుగా విచారించాలని, గంజాయి సరఫరా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, సరఫరా నెట్వర్క్, అసలు మూలాలను గుర్తించి, మూలాల నుంచే గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేలా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, నిందితులందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి జరిగే అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని,సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న నేరస్థులను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయదారుల వద్ద ఉన్న వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, యాజమాన్య బదిలీ పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. సరైన పత్రాలు లేని వాహనాల విక్రయాలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు.
పోలీస్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతూ అమలు తీరును సమీక్షించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, సాంబరాజు, నరసింహరావు, సర్వర్, సత్యనారాయణ, సిఐ లు పాల్గొన్నారు.




