Burgampahad: సారపాకలో పోలీసుల 'కార్డన్ అండ్ సర్చ్'..విస్తృతంగా తనిఖీలు!
Burgampahad:బూర్గంపాడు మండలం సారపాక మసీదు రోడ్డులో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానితులు, వాహనాలను తనిఖీ చేశారు.
Burgampahad: సారపాకలో పోలీసుల 'కార్డన్ అండ్ సర్చ్'..విస్తృతంగా తనిఖీలు!
Burgampahad: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా సారపాక మసీదు రోడ్డు ప్రాంతంలో మంగళవారం పోలీసులు విస్తృత స్థాయిలో 'కార్డన్ అండ్ సర్చ్' (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు. పాల్వంచ సీఐ సతీష్ కుమార్, బూర్గంపాడు ఎస్ హెచ్‌వో మేడ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా మసీదు రోడ్డు పరిసర ప్రాంతాలలోని పలు ఇళ్లను, వ్యాపార సముదాయాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఇళ్లలోని నివాసితులు, అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాల్వంచ సీఐ సతీష్ కుమార్, ఎస్ హెచ్‌వో మేడ ప్రసాద్ మాట్లాడుతూ అసాంఘిక శక్తుల కదలికలను అరికట్టడానికి, నేరాల నియంత్రణకు గాను ఈ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్థానికులు అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజా రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు పోలీసులకు సహకరించి కాలనీల్లో శాంతియుత వాతావరణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




