Kothagudem: రూ.4.97 లక్షల సైబర్ మోసానికి చెక్ పెట్టిన భద్రాద్రి సైబర్ క్రైమ్ పోలీసులు!

Kothagudem: ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో భద్రాద్రి సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి అశ్వాపురం ఉద్యోగి కోల్పోయిన రూ.4.97 లక్షలను సురక్షితం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 13 Nov 2026 11:54 PM IST
Kothagudem
X

Kothagudem: రూ.4.97 లక్షల సైబర్ మోసానికి చెక్ పెట్టిన భద్రాద్రి సైబర్ క్రైమ్ పోలీసులు!

Bhadradri Kothagudem: క్రెడిట్ కార్డు మోసంలో రూ.4,97,526 కోల్పోయిన బాధితుడికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి బాధితుడి నగదును సురక్షితం చేశారు. ఇందులో రూ.1,62,470 బాధితుడి ఖాతాలోకి రిఫండ్ చేయించగా, మరో రూ.3,35,056ను సంబంధిత బ్యాంకు ఖాతాల్లో హోల్డ్ చేయించారు.

అశ్వాపురం పరిధిలోని హెవీ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి ఈ నెల 8వ తేదీన నాలుగు విడతల్లో సైబర్ నేరగాళ్లు రూ.4,97,526 నగదును కాజేశారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన జిల్లా సైబర్ క్రైమ్ సెల్ అధికారులు లావాదేవీలను పరిశీలించి సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించి, నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన నగదును నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల చొరవతో రూ.1,62,470 రిఫండ్ కాగా, మిగిలిన రూ.3,35,056ను హోల్డ్ చేయించడంతో బాధితుడికి చెందిన మొత్తం రూ.4,97,526 సొమ్ముకు భద్రత లభించింది.

ఈ ఘటనపై అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 162/2026గా ఈ నెల 9వ తేదీన బీఎన్ఎస్ సెక్షన్ 318(4), ఐటీ యాక్ట్ 66(C), 66(D) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కే. నరేష్, ఎస్ఐ ఎస్.కే. జుబేదా, సిబ్బంది డి. వంశీకృష్ణ, బి. శ్రావణ్ కుమార్, వి. రజిత, సుప్రియ సమన్వయంతో పనిచేసి బాధితుడి నగదును సురక్షితం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే నగదు రికవరీకి ఎక్కువ అవకాశాలు సైబర్ మోసాలకు గురైన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే, ముఖ్యంగా గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలువరించే, రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అపరిచిత లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులకు వెల్లడించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM