Bhadrachalam: ముదిరాజ్ బజార్‌లో కార్డెన్ అండ్ సెర్చ్.. 15 వాహనాలు స్వాధీనం!

Bhadrachalam: భద్రాచలం ముదిరాజ్ బజార్‌లో పోలీసులు నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 22 Nov 2026 12:20 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ముదిరాజ్ బజార్‌లో కార్డెన్ అండ్ సెర్చ్.. 15 వాహనాలు స్వాధీనం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరాజ్ బజార్ ప్రాంతంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముదిరాజ్ బజార్ ప్రాంతంలోని మొత్తం 128 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన వాహన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను గుర్తించారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 15 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకోవాలని, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

అలాగే సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ కాల్స్, నకిలీ లింకులు, పెట్టుబడి మోసాలు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని, సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

రహదారి భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు వివరించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, నేరాల నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు టీజిఎస్‌పీ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, భద్రాచలం సబ్ డివిజన్‌కు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem