Khammam: కేంద్ర నిధులతోనే గ్రీన్‌ఫీల్డ్ హైవే.. కాంగ్రెస్‌కు పొంగులేటి కౌంటర్!

Khammam: సత్తుపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర నిధులే కారణమని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 18 Jun 2026 9:46 AM IST
Khammam
X

Khammam: కేంద్ర నిధులతోనే గ్రీన్‌ఫీల్డ్ హైవే.. కాంగ్రెస్‌కు పొంగులేటి కౌంటర్!

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, పచ్చదనం పెంపు కోసం యావత్ సమాజం నడుంబిగించాలని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సత్తుపల్లి మండల కేంద్రం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్'(తల్లి పేరు మీద ఒక మొక్క) పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పాలన విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో జూన్ 2 నుంచి 21 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను నిరవధికంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

*చెట్లతోనే జీవకోటి మనుగడ.. భావితరాలకు ప్రాణవాయువు*

అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదని, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడమే మోదీ సర్కారు అంతిమ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. చెట్లు లేనిదే జీవకోటి మనుగడ సాధ్యం కాదని, మొక్కలు నాటడం కేవలం ఒక ఈవెంట్‌గా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో బాధ్యతగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి రాబోయే తరాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వాటిని కంటికి రెప్పలా సంరక్షించాలన్నారు. వృక్షాలు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, సకాలంలో వర్షాలు కురవడంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. కాలుష్యరహిత సమాజ నిర్మాణం కోసం పౌరులంతా తమ వంతు కర్తవ్యంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

*నూటికి నూరు శాతం కేంద్రం నిధులతోనే హైవే నిర్మాణం*

అనంతరం ప్రతిష్టాత్మక గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన పొంగులేటి, ఈ కారిడార్ ప్రాముఖ్యతను వివరించారు. ఖమ్మం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చివేసే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే కేవలం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మాత్రమే నిర్మించబడుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు.

దీని కోసం కేంద్రం ఏకంగా 4,609 కోట్ల రూపాయల భారీ నిధులను ఖర్చు చేసిందని , ఇది నూటికి నూరు శాతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధి వల్లే సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతతో నిర్మితమవుతున్న ఈ జాతీయ రహదారితో ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు.

ఇంతటి బృహత్తర ప్రాజెక్టును కేంద్రం కళ్లెదుటే నిర్మిస్తుంటే.. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం సిగ్గులేకుండా ఈ రహదారిని తామే మంజూరు చేయించామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో కాంగ్రెస్ పాత్ర శూన్యమని, ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

*కాంగ్రెస్‌ది మాయమాటల ప్రభుత్వం*

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం "మాటల ప్రభుత్వం మాత్రమేనని, ఏమాత్రం "చేతల ప్రభుత్వం" కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు తీయటి మాయమాటలు చెప్పి, కల్లబొల్లి కబుర్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు హామీలను గాలికొదిలేసి ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

సొంతంగా ఏ ఒక్క అభివృద్ధి పనినీ చేపట్టలేని అసమర్థ స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇస్తున్న నిధులతో జరుగుతున్న పనులకు తమ స్టిక్కర్లు వేసుకునే పాడు బుద్ధిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి మౌలిక సదుపాయాల కల్పనపై ఏనాడూ చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తుంటే.. ఆ ప్రగతిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అసూయతో బురదజల్లే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

పదే పదే ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు,జిల్లా కార్యదర్శి వీరంరాజు, సత్తుపల్లి మండల, పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, శాలి శివకృష్ణ, వేంసూర్ మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పరస రాంబాబు, రఘునాథరెడ్డి, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, బండి వెంకటరెడ్డి, నల్లమోతు నాని బాబు, కొప్పుల మధుసూదన్ రెడ్డి , వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story