Khammam: సాగర్ కాలవలో సాహసం.. గోమాత ప్రాణం కాపాడిన రానా!


Khammam: సాగర్ కాలవలో సాహసం.. గోమాత ప్రాణం కాపాడిన రానా!
Khammam: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథ బంజరలో సాహసం! సాగర్ కాలవలో పడిపోయిన గోమాతను ప్రాణాలకు తెగించి కాపాడిన సర్పంచ్ భర్త రానా.
ఖమ్మం జిల్లా: కల్లూరు మండలం మానవత్వం ఇంకా సజీవంగా ఉందనే నిదర్శనంగా నిలిచే ఘటన మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. సాగర్ కాలవలో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న గోమాతను ప్రాణాలకు తెగించి కాపాడిన సర్పంచ్ భర్త రానా ధైర్యసాహసం స్థానికులను కట్టిపడేసింది.
వివరాల్లోకి వెళితే.. కాలవలో చిక్కుకుని బయటపడలేక అలమటిస్తున్న గోమాతను గమనించిన రఘునాథ గూడెం గ్రామ సర్పంచ్ కుక్కా సుధారాణి భర్త రానా క్షణం ఆలస్యం చేయకుండా స్పందించాడు.పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన ఆయన వెంటనే కాలవలోకి దూకి గోమాతను రక్షించే ప్రయత్నం ప్రారంభించాడు.
అయితే భయంతో వణికిపోయిన గోవు దగ్గరకు రానీయకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలవలో ఈదుకుంటూ వెంబడించాల్సి వచ్చింది. ఇరువైపులా సైడ్ వాల్స్ ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారినా, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రానా పోరాటం కొనసాగించాడు. చివరికి కొంత వెసులుబాటు ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత స్థానికుల సహకారంతో తాళ్లను ఉపయోగించి గోమాతను సురక్షితంగా ఒడ్డుకు లాగారు. ఈ క్రమంలో గోవు భయంతో వెనుక కాళ్లతో తన్నినా, రానా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన ధైర్యాన్ని చాటుకున్నాడు. ప్రాణాపాయంలో ఉన్న మూగజీవాన్ని కాపాడిన రానా ధైర్యసాహసం గ్రామంలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. గ్రామ అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా,కరుణా హృదయంతో గోమాత ప్రాణాలు రక్షించిన ఆయనను స్థానికులు, ప్రయాణికులు ఘనంగా అభినందించారు.ఈ రక్షణ కార్యక్రమంలో కుక్కా లాలు, పోతురాజు రాము, అంజారావు, రావుల సీతయ్య, బండి వెంకయ్య,నల్లగొర్ల నాగేశ్వరరావు, కుక్క శ్రీనివాసరావు, కొలికపోగు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

