Kothagudem: ప్రజావాణి అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, పిల్లల ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన అర్జీలు స్వీకరించారు.
Kothagudem: ప్రజావాణి అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్!
Kothagudem: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు.
సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డీపీఓ అనూషతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, పింఛన్లు, గృహాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య స్వభావం, అర్హతలను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఇతర శాఖల సహకారం అవసరమైన సందర్భాల్లో పరస్పర సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ భాగస్వామ్యంతో ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’ అనే నినాదంతో పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ దరఖాస్తులు సమర్పించారు. పిల్లల ప్రజావాణిలో మొత్తం 73 దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లల ప్రజావాణి ద్వారా బాలల అవసరాలు, సమస్యలు, అభిప్రాయాలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకొని వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. బాలల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ పిల్లల సమస్యలను వారి కోణంలో అర్థం చేసుకొని, వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా బాలల స్నేహపూర్వక పాలన సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు:
కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన స్పందన అనే ఒంటరి మహిళ తన కుమారుడు బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, మొదటి సంవత్సరం నుంచి రావాల్సిన స్కాలర్షిప్ ఇప్పటివరకు జమ కాలేదని తెలిపారు. స్కాలర్‌షిప్‌పై ఆధారపడి చదువుకుంటున్న తన కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
ములకలపల్లి మండలం చండ్రుకుంట రాజాపురం గ్రామానికి చెందిన 34 మంది రైతులు 2000 సంవత్సరం నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నామని, వారిలో కొంతమందికి మాత్రమే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరయ్యాయని, మిగిలిన రైతులకు కూడా పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు.
బూర్గంపాడు మండలం పినపాక గ్రామానికి చెందిన భానోత్ వెంకటేశ్వర్లు గతంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఎయిడ్స్, లెప్రసీ మొబైల్ హెల్త్ బృందంలో కౌన్సిలర్‌గా పనిచేశానని, ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. తనకు సోషల్ వర్కర్‌గా ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
పిల్లల ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు:
లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుల చీలక గ్రామానికి చెందిన వెకో గణేష్ తాము ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 30 సంవత్సరాల క్రితం వలస వచ్చి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. తన ఇద్దరు పిల్లలు అమీర్, మున్నాలకు ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు జారీ కాలేదని, ఆధార్ కార్డులు లేక పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులు మంజూరు చేయించి వారి విద్యాభ్యాసానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
మణుగూరు మండలం ధమ్మక్కపేట గ్రామానికి చెందిన బట్ట జోష్ణ తన తండ్రి అనారోగ్యంతో మరణించారని, తన చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
అశ్వాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన 12 ఏళ్ల కనితి శ్రీవల్లి తాను ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నానని, తన తండ్రి మరణించడంతో చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ బాలల దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, అర్హతల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జిల్లా సంక్షేమ అధికారి కె.ఎం. తార, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎం.డి. సాధిక్ పాషా, ఎస్. సుమిత్రాదేవి, కె. అంబేద్కర్, బాలల సంరక్షణ అధికారి ఎం. హరికుమారి, నేషనల్ న్యూట్రిషన్ రూప, డీసీపీయూ సిబ్బంది ఆదే శేషయ్య, అబ్దుల్ అజీజ్, నాగరాజు, వినోద్ కుమార్, టి. బాబు, టి. భారతి, కళ్యాణి, లత, రాజు, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సందీప్ కుమార్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.




