Sarapaka: అధికారుల గైర్హాజరుతో సారపాక గ్రామసభ రద్దు. భగ్గుమన్న ప్రజలు!

Sarapaka: సారపాకలో అధికారుల గైర్హాజరుతో గ్రామసభ రద్దయింది. 18 వార్డుల ప్రజల ఆగ్రహం, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై పూర్తి వివరాలు.

RAVI, BURGAMPAD AREA
Published on: 27 Aug 2026 11:33 AM IST
Sarapaka
X

Sarapaka: అధికారుల గైర్హాజరుతో సారపాక గ్రామసభ రద్దు. భగ్గుమన్న ప్రజలు!

Sarapaka: ప్రజల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపించాల్సిన గ్రామసభకు సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంతో సారపాక గ్రామసభ రద్దైన పరిస్థితి నెలకొంది. గ్రామసభ నిర్వహణకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చినా.. అధికారుల గైర్హాజరు కారణంగా సభ ముందుకు సాగకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

సారపాక గ్రామపంచాయతీలోని 18 వార్డుల ప్రజలు గ్రామసభకు హాజరై తమ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సిద్ధమైనప్పటికీ, సంబంధిత శాఖల అధికారులు మాత్రం సభకు హాజరుకాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్రామసభకే అధికారులు డుమ్మా కొడితే.. ఇక తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు గ్రామసభ నిర్వహణపై సర్పంచ్‌కు సైతం పూర్తి స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన సమయంలో ఎవరు రావాలి? ఏ శాఖ నుంచి అధికారులు హాజరుకావాలి? గ్రామసభను ఎలా నిర్వహించాలి? అనే అంశాల్లో స్పష్టత లేకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

రెవెన్యూ శాఖ నిర్లక్ష్యమేనా?

గ్రామసభకు అధికారులు హాజరుకాకపోవడంపై ప్రధానంగా మండల రెవెన్యూ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామసభకు ఉన్న ప్రాధాన్యత తెలిసినప్పటికీ అధికారులు గైర్హాజరు కావడం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు నిర్వహించే గ్రామసభకు అధికారులు రాకపోవడం ప్రజలను అవమానించడమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు, గ్రామసభ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు పాటించారా? లేదా? అనే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు రాకపోతే గ్రామసభల ప్రయోజనం ఏమిటి?

ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించాల్సిన అధికారులు గ్రామసభకు హాజరుకాకపోతే.. గ్రామసభ నిర్వహణ వల్ల ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు సమయాన్ని కేటాయించి సభకు వస్తుంటే.. అధికారులు మాత్రం బాధ్యతారాహిత్యంగా గైర్హాజరు కావడం ఎంతవరకు సమర్థనీయం? అని నిలదీస్తున్నారు.

సారపాకలో చోటుచేసుకున్న ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామసభకు అధికారులు ఎందుకు హాజరుకాలేదు? ఎవరి నిర్లక్ష్యం కారణంగా సభ రద్దైంది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామసభనే అధికారులు పట్టించుకోకపోతే.. గ్రామస్థుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్న ఇప్పుడు సారపాకలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA