Sarapaka: పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు సర్పంచ్ వినతి!
Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామపంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ మంత్రి సీతక్కను కోరారు.
Sarapaka: పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు సర్పంచ్ వినతి!
Sarapaka: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కార్మికుల సంక్షేమం కోసం సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కోరారు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయక్ మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ముఖద్వారంగా ఉన్న సారపాక ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా విస్తరించిందని తెలిపారు.
గ్రామపంచాయతీ పరిధిలో పారిశ్రామిక సంస్థలు, నివాస కాలనీలు అధికంగా ఉండటంతో పాటు ప్రజల రాకపోకలు నిరంతరం కొనసాగుతుంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర గ్రామపంచాయతీ విధుల్లో మల్టీపర్పస్ వర్కర్స్ నిరంతరం సేవలందిస్తున్నారని వివరించారు.
అయితే జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అందకపోవడంతో భవిష్యత్తు ఆర్థిక భద్రత, అత్యవసర వైద్య అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం లభించలేదని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల ఆర్థిక భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కిషోర్ నాయక్ వినతిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమన్న పాల్గొన్నారు.




