Sathupalli: జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటైన కలం: సత్తుపల్లిలో ఐక్యవేదిక

Sathupalli: సత్తుపల్లిలో యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌ల విభేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం జర్నలిస్టులంతా ఒకే వేదికపై ఏకమయ్యారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 13 Sept 2026 9:35 PM IST
Sathupalli
X

Sathupalli: జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటైన కలం: సత్తుపల్లిలో ఐక్యవేదిక

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సత్తుపల్లి జర్నలిస్టులు నిర్ణయించారు. వివిధ జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌ల ఆధ్వర్యంలో సదాశివునిపేటలో నిర్వహించిన జర్నలిస్టుల ఐక్యవేదిక సమావేశం స్నేహపూర్వక, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. వివిధ సంఘాలకు చెందిన జర్నలిస్టులు ఒకే వేదికపై కలుసుకుని పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

సమావేశంలో సీనియర్ రిపోర్టర్ బీవీ రామారావు మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య ఉన్న చిన్నచిన్న భేదాలను పక్కనపెట్టి అందరం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలమన్నారు. సంఘాలు, సంస్థలు వేరైనా జర్నలిస్టుల ప్రయోజనాల విషయంలో అందరి లక్ష్యం ఒక్కటే కావాలని అన్నారు.

ముఖ్య ప్రసంగీకులు, సీనియర్ జర్నలిస్టు యం.డి. షైబుధిన్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అన్ని యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌లు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోసం కూడా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత, సంస్థాగత విభేదాలకు అతీతంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు.

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఐక్యతే జర్నలిస్టుల బలమని పేర్కొన్నారు. ఒకరి విజయాన్ని మరొకరు అభినందిస్తూ, ఒకరి సమస్యకు మరొకరు అండగా నిలిచే స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల మధ్య పరస్పర గౌరవం, సహకారం మరింత బలోపేతం కావాలని అన్నారు.

సత్తుపల్లి జర్నలిస్టులు యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌లకు అతీతంగా ఒకే వేదికపై కలసి ముందుకు సాగడం రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇకపై జర్నలిస్టులకు సంబంధించిన ఉమ్మడి సమస్యలు, హక్కుల సాధన అంశాల్లో సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

సంఘాలు వేరైనా… జర్నలిస్టుల హక్కుల కోసం గొంతు ఒక్కటే కావాలి, కలం ఒక్కటే దిశగా నడవాలి అనే స్ఫూర్తితో ఐక్యతను కొనసాగించాలని సమావేశం పిలుపునిచ్చింది. జర్నలిస్టుల మధ్య స్నేహం, ఆత్మీయత, ఐకమత్యంతో సాగిన ఈ సమావేశం సత్తుపల్లి నుంచి రాష్ట్రానికి ఒక మంచి సందేశాన్ని అందించింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI