Sathupally: నకిలీ పోలీసుల డెకాయిటీ ముఠా అరెస్ట్.. టీజీఎస్పీ సిబ్బంది
Sathupally: గంగారంలో బ్లాక్ మనీ పేరుతో దోపిడీ చేస్తున్న 12 మంది నిందితుల అరెస్ట్. ఇద్దరు టీజీఎస్పీ కానిస్టేబుల్, ఆర్‌ఎస్‌ఐలపై కల్లూరు ఏసీపీ యాక్షన్.
Sathupally: నకిలీ పోలీసుల డెకాయిటీ ముఠా అరెస్ట్.. టీజీఎస్పీ సిబ్బంది
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి గంగారం పరిధిలో సంచలనం సృష్టించిన డెకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. అమాయకులను కోట్ల రూపాయల బ్లాక్ మనీ పేరుతో నమ్మించి, నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. ఈ కేసులో ఇద్దరు టీజీఎస్పీ 15 వ బెటాలియన్ సిబ్బంది కూడా ఉండటం సంచలనంగా మారింది. 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో నగదు, వాహనాలు, పోలీస్ యూనిఫాంలు, డమ్మీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కురా గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నమ్మదగిన సమాచారంతో గంగారం ప్రాంతంలో డెకాయిట్ ముఠాకు చెందిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని చెప్పి అమాయకులను ఆకర్షించేవారు.
10 వేల రూపాయికి నాలబై వేల రూపాయలు ఇస్తామని నమ్మించి బాధితులను నగదుతో రప్పించి, ముందుగానే సిద్ధం చేసిన నకిలీ పోలీసులతో దాడి చేయించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవారని పోలీసులు వెల్లడించారు.ఈ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్, టీజీఎస్పీ 15వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ బేరా కేశవరావు కూడా ఉండటం గమనార్హం. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
నిందితుల వద్ద నుంచి రూ.17 లక్షల 60 వేల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, రెండు పోలీస్ యూనిఫాంలు, ఒక హ్యాండ్‌కఫ్, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ యూనిఫాంలు, పోలీస్ రైన్‌కోట్లు, పోలీస్ పేరుతో టీ-షర్టులు, అలాగే 500 రూపాయాల చిల్డ్రన్స్ డమ్మీ కరెన్సీ నోట్ల 80 బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నామని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.




