Sathupally: సత్తుపల్లి సింగరేణిలో హైటెన్షన్.. గేట్ల తాళాలు బద్దలు కొట్టిన కవిత!
Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ఓసీ-2 గని వద్ద కల్వకుంట్ల కవిత చేపట్టిన 'బాయిబాట' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
Sathupally: సత్తుపల్లి సింగరేణిలో హైటెన్షన్.. గేట్ల తాళాలు బద్దలు కొట్టిన కవిత!
Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ఓసీ-2 లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన బాయిబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సింగరేణి అధికారులు తొలుత లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులతో గేట్ తాళాలు బద్దలు కొట్టి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు.
సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ఓసీ-2లో హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అధికారులు తొలుత గనిలోకి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశించారు.
సత్తుపల్లి సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. హెచ్‌ఎంఎస్ యూనియన్ నిజాలు చెబుతుంటే వాటిని జీర్ణించుకోలేక పోలీసులను అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం గేట్లు బద్దలు కొట్టి అయినా లోపలికి రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
హెచ్‌ఎంఎస్ యూనియన్‌ను లోనికి రాకుండా గేట్లకు తాళాలు వేశారని, కార్మికులకు అండగా నిలవాల్సిన యూనియన్లు యాజమాన్యం కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఏఐటీయూసీ యూనియన్ సిగ్గుపడాలని, దమ్ముంటే కార్మికుల హక్కులను కాపాడాలని సవాల్ విసిరారు. సింగరేణి ఆసుపత్రిని కేవలం రెండు పడకలతో నడుపుతున్నారని, కార్మికుల సంక్షేమం, వెల్ఫేర్, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఇల్లందు, మణుగూరులో ఉన్న పరిస్థితి సత్తుపల్లికి రాకూడదని, కొత్తగా వచ్చే సింగరేణి గనులను ప్రైవేట్‌కు అప్పగించవద్దని డిమాండ్ చేశారు.కార్మికుల పక్షాన ప్రశ్నించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం సరైన విధానం కాదని, హెచ్‌ఎంఎస్ యూనియన్ తరఫున జీఎంను లేబర్ కోర్టుకు ఈడుస్తామని తెలిపారు.
కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను అణగదొక్కుతోందని, ఆ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కార్మికుల హక్కుల కోసం హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.




