Sattupalli: కోటీశ్వరులుగా మహిళలను తీర్చిదిద్దడమే ధ్యేయం - సీతక్క
Sattupalli: సత్తుపల్లిలో జరిగిన ఇందిర మహిళాశక్తి సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Sattupalli: కోటీశ్వరులుగా మహిళలను తీర్చిదిద్దడమే ధ్యేయం - సీతక్క
సత్తుపల్లి: మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తూ, ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మహిళల చేతుల్లో డబ్బు ఉండాలని, తమకు నచ్చిన విధంగా జీవించే ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని సిద్ధారం రోడ్డులో గల ఎం.ఆర్. గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో 1000 రోజుల ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ఇందిర మహిళాశక్తి సదస్సులో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లతో కలిసి పాల్గొన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారంటే ప్రభుత్వంపై వారికి ఉన్న ప్రేమ, విశ్వాసానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ, వారి ఆర్థిక స్వావలంబనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మంత్రి తెలిపారు.
మహిళలు తమకు నచ్చిన వ్యాపారాలను ప్రారంభించి, స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. ఇందుకోసం మహిళా సంఘాలకు ఏపీఎంలు, డీఆర్‌డీఓ అధికారులు అవసరమైన సహకారం అందిస్తారని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గత రెండున్నరేళ్లలో పంచాయతీరాజ్, మహిళా సంఘాల సంక్షేమం, తాగునీరు తదితర రంగాల్లో సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పల్లె, గూడెం, తండా, వాడలో అవసరమైన సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహిళా సంఘాలు కేవలం పొదుపు, రుణాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళా అర్ధిక పురోగతికి కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మేడారం జాతర సందర్భంగా మహిళా సంఘాలకు సుమారు రూ. 6 కోట్ల మేర రుణ సహాయం అందించగా, మహిళలు కేవలం 15 రోజుల్లోనే సుమారు రూ.9 కోట్ల వ్యాపారం చేసి లాభాలు ఆర్జించారని గుర్తుచేశారు.
సత్తుపల్లిలో కూడా టిఫిన్ సెంటర్లు, క్యాంటీన్లు, డెయిరీ, పౌల్ట్రీ, సోలార్, కుట్టు యూనిట్లు, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తుల ఆధారంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు. స్థానికంగా లభించే ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయిస్తే మహిళలకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కలెక్టరేట్లు, ఇతర ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో మహిళా సంఘాలతో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మహిళలు క్యాంటీన్ల ద్వారా నెలకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా సదుపాయం కల్పిస్తూ, రుణం తీసుకున్న సభ్యురాలు మరణించిన సందర్భంలో నిర్దిష్ట పరిమితి వరకు రుణాన్ని మాఫీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా ప్రమాదవశాత్తు మహిళలు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.10 లక్షల వరకు సహాయం అందిస్తున్నామని చెప్పారు.
మహిళలకు ఆత్మగౌరవ భవనాలు
మహిళా సంఘాల సమావేశాలు చెట్ల కింద లేదా ఇతరుల ఇళ్ల వద్ద నిర్వహించాల్సిన పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వీవో భవనాలను నిర్మిస్తోందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక వీవో భవనాలు మంజూరు చేశామని, ఇంకా అవసరమైన భవనాలను కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
జిల్లా సమాఖ్యల కోసం రూ. 5 నుంచి రూ.7 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మిస్తున్నామని, మహిళల శిక్షణ, సమావేశాలు, వ్యాపార కార్యకలాపాలకు అవి ఉపయోగపడతాయని చెప్పారు.
మహిళల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత
మహిళలకు అక్షరాస్యత కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులందరికీ చదువు నేర్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలు విద్యావంతులై, తమ పిల్లలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని సూచించారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు స్వేచ్ఛ
మహిళలు అత్యవసర సమయాల్లో తమ పనుల కోసం ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మహిళలు సులభంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేర్లపై
మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇల్లు, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ ప్రయోజనాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని, మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చి సిబ్బందికి వేతనాలు పెంచామని, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంగన్వాడీ పిల్లలకు యూనిఫాంలతో పాటు అల్పాహారం, పోషకాహారం అందించే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పిల్లలను తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు.
స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలి
గ్రామాల్లో లభించే సహజ వనరులు, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పదార్థాలను మహిళలు వ్యాపారాలుగా మలచుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పపువ్వు లడ్డూల వంటి స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, వాటిని పరిశుభ్రంగా, నాణ్యతతో తయారు చేసి మార్కెట్ చేస్తే మహిళలకు మంచి ఆదాయం లభిస్తుందని చెప్పారు.
మహిళలు ప్రతి నెలా రూ.10 వేల నుంచి ప్రారంభించి లక్షలు, చివరకు కోట్లు సంపాదించే స్థాయికి ఎదగాలన్న పట్టుదలతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందిస్తున్న పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. చిన్న స్థాయిలో కుట్టు మిషన్‌తో ప్రారంభించిన మహిళలు నేడు పెద్ద కంపెనీలు నిర్వహించే స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు.
ఇందిర మహిళాశక్తి కార్యక్రమం కింద మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కూడా మహిళల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం కావడం విశేషమని, దాని ద్వారా నెలకు సుమారు రూ. 2.50 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందని చెప్పారు. చిన్న స్థాయి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు మహిళలను భాగస్వామ్యం చేస్తూ ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
మహిళా సంఘాల సభ్యులకు రుణాలు, బీమా తదితర సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రుణం తీసుకున్న సభ్యురాలు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులపై రుణభారం పడకుండా లోన్ ఇన్సూరెన్స్, లోన్ వేవర్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
మహిళలు ఒకే రంగంకు పరిమితం కాకుండా వివిధ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలు ఐక్యతతో ముందుకు సాగుతూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గతంలో మహిళా సంఘాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, రుణాలపై అధిక వడ్డీ భారంతో చాలామంది సభ్యులు సంఘాల నుంచి వైదొలిగిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర వర్గాల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్తగా సుమారు 470 మహిళా సంఘాలు ఏర్పడటం మహిళల్లో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనమన్నారు.
మహిళా సంఘాలకు వారి అర్హతను బట్టి పెద్ద మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, ఈ రుణాలపై మహిళలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందిస్తోందని తెలిపారు. రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వం భరిస్తోందన్నారు.
మహిళల కోసం ప్రమాద బీమా, లోన్ బీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని, లోన్ బీమా కింద ఇప్పటికే సుమారు 870 మంది సభ్యులకు ప్రయోజనం అందించామని ఎమ్మెల్యే తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వ్యాపార అవకాశాలు, సోలార్ యూనిట్లు, ఇతర ఉపాధి కార్యక్రమాలు మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రెహ్మన్ బేగం, కల్లూరు ఎసీపీ వసుందర, సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




