Julurupadu: వెంగన్నపాలెంలో మురికి నీరంతా రోడ్డుపైనే ప్రవాహం!

Julurupadu: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో డ్రైనేజీ లేక రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో బీఆర్ఎస్, సీపీఐ నేతలు మురికి నీటిలో నిల్చొని నిరసన తెలిపారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 13 Nov 2026 6:41 PM IST
Julurupadu
X

Julurupadu: వెంగన్నపాలెంలో మురికి నీరంతా రోడ్డుపైనే ప్రవాహం!

జూలూరుపాడు: వెంగన్నపాలెం గ్రామపంచాయతీలో మురికి నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తుంది. గ్రామపంచాయతీ పరిధిలోని రావి చెట్టు బజార్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లల్లో వినియోగించుకున్న నీళ్లన్నీ పలువురు సిసి రోడ్డుపైకే వదలడంతో రోడ్ అంతా బురదమైయంగా మారింది.

మురికి నీరు కావడంతో అటుగా వెళ్లే వారికి చుట్టుపక్కల దుకాణాల వారికి దుర్వాసన వెదజలుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనాలు వెళ్ళే సమయంలో ఆ మురికి నీరు పాదచారులపై పడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు సీపీఐ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో స్థానికలతో కలిసి మురికి నీటిలో నించొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రావి చెట్టు బజార్లు మురికి నీరు అంతా ఇలా రోడ్డుపైనే ప్రవహిస్తుందని వారు ఆరోపించారు.

జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాలను కలిపే ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందని, అదేవిధంగా ఈ రోడ్డుకు ఇరువైపులా పలు దుకాణాలు ఉండటంతో మండలంలోని గ్రామాల ప్రజలు సైతం నిత్యం ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తూ ఉంటారని, ఇలా రద్దీ ఉన్న రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డుపైన మురికి నీరు ప్రవహిస్తుందని పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి,మండల పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అధికారులు సందర్శించారు గాని నేటి వరకు సమస్యకు పరిష్కారం చూపలేదని వారు విమర్శించారు. ఇంత రద్దీగా ఉన్న రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురికి నీటిని రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాళ్లూరి వెంకటేశ్వర్లు, నిమ్మటూరి రాఘవులు, రేగళ్ల లక్ష్మయ్య, కడియాల శ్రీను, పోతురాజు రామారావు, శేషాద్రి లక్ష్మయ్య, పెంటికల వెంకటేశ్వర్లు, పురుస్తపుర రామకృష్ణ, ఆదిమల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU