Rudrampur: శోధా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వీడాలి: సాబీర్ పాషా!

Rudrampur: కొత్తగూడెం ఏరియా వీకేసీఎం ఓపెన్‌కాస్ట్ ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా సందర్శించి యాజమాన్యాల తీరుపై మండిపడ్డారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Nov 2026 5:55 PM IST
Rudrampur
X

Rudrampur: శోధా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వీడాలి: సాబీర్ పాషా!

​కొత్తగూడెం (రుద్రంపూర్): ఓబీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయడంలో శోధా కంపెనీ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తీవ్రంగా ఎండగట్టారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్ (వీకేసీఎం) ఓపెన్‌కాస్ట్ ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

కార్మికులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా శోధా యాజమాన్యం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం కూడా తగిన చొరవ తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యాలు స్పందించి కార్మికులకు రావాల్సిన బోనస్, వేతనాలు, ఇతర చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి పనిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల ఓపికను పరీక్షించవద్దని, తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి పోరాటంలో సిపిఐ, ఏఐటీయూసీ ముందుండి నడిపిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, ఓబీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, కంచర్ల జమలయ్య, నాయకులు జె గట్టయ్య, మార్షల్, యూసఫ్, భూక్యా శ్రీను, నేరెళ్ల రమేష్, బండి నర్సింహా, బోయిన విజయ్ కుమార్, గడ్డం సతీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM