Singareni: సింగరేణి డంపర్లకు మహిళా సారథులు
Singareni: సింగరేణి చరిత్రలో తొలిసారిగా మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకం. 13 మంది మహిళా ఉద్యోగులకు హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి.
Singareni: సింగరేణి డంపర్లకు మహిళా సారథులు
Singareni: సింగరేణి చరిత్రలో తొలిసారిగా మహిళలు భారీ డంపర్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్ గనుల్లో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి సన్నద్ధమైంది. ఇప్పటికే హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ పూర్తి చేసిన 13 మంది మహిళా ఉద్యోగులకు త్వరలో అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్‌బర్డెన్ రవాణా కోసం 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ డంపర్లను కేవలం పురుషులే నడుపుతూ వస్తున్నారు. భారీ వర్షాలు, ఎండలు, చలి పరిస్థితుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉండటంతో ఈ పని అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తారు. అయితే మహిళా శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది.
డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపిన మహిళా ఉద్యోగులకు సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు. కంపెనీ ఖర్చులతో నిర్వహించిన ఈ శిక్షణలో పాల్గొన్న మహిళలు హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళా ఉద్యోగులు డంపర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ సమయంలో గనుల్లో కూడా తమ ప్రతిభను చాటేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉందని మహిళా ఉద్యోగులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సాధికారతకు పెద్ద ఊతమని పేర్కొన్నారు. ఇప్పటికే బెల్లంపల్లి ఖైరీగూడ ఓపెన్‌కాస్ట్ గనిలో మహిళలు బ్లాస్టింగ్ విభాగంలో విజయవంతంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్లిష్టతర బాధ్యతల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.




