Kothagudem: సమ్మె నోటీసుతో దిగివచ్చిన సింగరేణి.. 23 ప్రధాన డిమాండ్లకు ఆమోదం!

Kothagudem: సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పోరాటానికి యాజమాన్యం దిగివచ్చింది. పెర్క్స్‌పై ఐటీ చెల్లింపు, సహజ మరణ పరిహారం రూ.20 లక్షలు సహా 23 కీలక డిమాండ్లపై ఒప్పందం కుదిరింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Aug 2026 6:19 PM IST
Kothagudem
X

Kothagudem: సమ్మె నోటీసుతో దిగివచ్చిన సింగరేణి.. 23 ప్రధాన డిమాండ్లకు ఆమోదం!

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కొనసాగించిన పోరాటం మరో కీలక విజయాన్ని సాధించిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్‌ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై యాజమాన్యంతో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో పలుమార్లు చర్చలు జరిగాయి.

గురువారం జరిగిన కీలక చర్చల్లో సింగరేణి యాజమాన్యం పలు ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి కీలక ఒప్పందాలకు అంగీకరించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఏఐటీయూసీ కొనసాగించిన ఒత్తిడి, పోరాటం ఫలితంగానే యాజమాన్యం దిగివచ్చి ఈ నిర్ణయాలు తీసుకుందని నాయకులు పేర్కొన్నారు.

ప్రధానంగా కుదిరిన ఒప్పందాలు

పెర్క్స్‌పై ఆదాయపు పన్ను: కోల్‌ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా సింగరేణి కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌పై విధించే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను యాజమాన్యం భరించే విధంగా అంగీకారం తెలిపింది.

సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు: సర్వీసులో ఉండగానే సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు అందించే అంశంపై యాజమాన్యం అంగీకరించింది.

ప్రతి నెల మెడికల్‌ బోర్డు: కార్మికుల వైద్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి నెల మెడికల్‌ బోర్డు నిర్వహించేందుకు అంగీకరించింది.

2025–26 వాస్తవ లాభాల ప్రకటన: 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకుని చర్యలు చేపట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

ట్రాన్స్‌ఫర్లలో మూడేళ్ల నిబంధన తొలగింపు: ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి అమలులో ఉన్న మూడు సంవత్సరాల సర్వీస్‌ నిబంధనను తొలగించి, ఖాళీల ఆధారంగా ఒక సంవత్సరం నిబంధనతో ట్రాన్స్‌ఫర్లు చేపట్టేందుకు అంగీకరించింది.

సీనియర్‌ మైనింగ్‌ స్టాఫ్‌కు ఓవర్నర్‌ ప్రమోషన్లు: మైనింగ్‌ స్టాఫ్‌లో సీనియర్‌ ఎంఎస్‌లుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఓవర్నర్‌ ప్రమోషన్లు కల్పించేందుకు అంగీకరించింది.

మారుపేర్ల సమస్య: మారుపేర్లకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇందులో యూనియన్‌ సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు పేర్కొంది.

హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి: సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో సింగరేణి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశంపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనల్లో మార్పులు: దాదాపు 22 ఏళ్లుగా మార్పులు లేని మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనలను సవరించేందుకు అంగీకరించింది.

సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు చికిత్స: సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీ సేవలతో పాటు వారం రోజుల వరకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

సింగరేణి విద్యాసంస్థల్లో CBSE సిలబస్: సింగరేణి పరిధిలోని విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో CBSE సిలబస్‌ అమలు చేసే అంశంపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

భద్రతా సామగ్రి: గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన సేఫ్టీ మెటీరియల్‌ను సకాలంలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

మందమరి–క్యాతన్‌పల్లి పరిధిలో 9 శాతం HRA: ఈ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 9 శాతం HRA అందించే అంశంపై అంగీకారం తెలిపింది.

డిస్మిస్‌ కార్మికుల పెండింగ్‌ కేసులు: సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డిస్మిస్‌ కేసులను HPC కమిటీ ద్వారా పరిష్కరించేందుకు అంగీకరించింది.

మైనింగ్‌ స్టాఫ్‌కు సూటబుల్‌ సర్ఫేస్‌ ఉద్యోగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌ స్టాఫ్‌లో జనరల్‌ అసిస్టెంట్లుగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా సర్ఫేస్‌లో సూటబుల్‌ జాబ్‌ కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ ESI: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ ESI వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకునేందుకు అంగీకరించింది.

డిపెండెంట్‌ ఉద్యోగాల పెండింగ్‌ కేసులు: పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్‌ ఉద్యోగాల కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈవెనింగ్‌ కాలేజీలకు NOC: సింగరేణి ఉద్యోగులు సాంకేతిక విద్యను కొనసాగించేందుకు ఈవెనింగ్‌ కాలేజీల్లో చదువుకోవడానికి అవసరమైన NOCలు జారీ చేసేందుకు అంగీకరించింది.

ఖాళీ పోస్టుల భర్తీ: క్లారికల్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, పారామెడికల్‌, S&PC సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్లు, మెకానికల్‌ సూపర్‌వైజర్లు తదితర ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

క్యాడర్‌ స్కీమ్‌ సమస్యలు: EP ఫిట్టర్లు, SDL ఆపరేటర్లు, సర్వేయర్లు తదితర క్యాడర్‌ స్కీమ్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అంగీకరించింది.

149 మంది మెడికల్‌ ఫిట్‌ డిపెండెంట్లకు ఆఫీస్‌ ఆర్డర్లు: మెడికల్‌గా ఫిట్‌ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్‌ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

సొంత ఇంటి పథకం: కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలవుతున్న విధానాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది.

చట్టబద్ధ సమ్మెలో పాల్గొనే కాంట్రాక్ట్‌ కార్మికులు: చట్టబద్ధంగా జరిగే సమ్మెలో కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొంటే ‘నో వర్క్‌–నో పే’ విధానం అమలు చేస్తామని, వారికి ఫైన్లు విధించబోమని అంగీకరించినట్లు ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.

పోరాట ఫలితమే కీలక ఒప్పందాలు

కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, యాజమాన్యంపై కొనసాగించిన నిరంతర ఒత్తిడి ఫలితంగానే పలు కీలక అంశాలపై అంగీకారం కుదిరిందని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు.

పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు, ప్రతి నెల మెడికల్‌ బోర్డు, లాభాల ప్రకటన, ట్రాన్స్‌ఫర్‌ నిబంధనల మార్పు, ప్రమోషన్లు, వైద్య సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్‌ ఉద్యోగాలు తదితర అంశాలపై సాధించిన అంగీకారాలు సింగరేణి కార్మికుల పోరాట చరిత్రలో ముఖ్యమైన మైలురాయి అని వారు పేర్కొన్నారు.

చర్చల్లో పాల్గొన్నవారు

ఈ చర్చల్లో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య, వై.వి.రావు, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, ముస్కే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి యాజమాన్యం తరఫున డైరెక్టర్‌ పా.గౌతం పోట్రూ, జీఎం పర్సనల్‌ కిరణ్‌కుమార్‌, అజయ్‌, జీఎం ఎంఎస్‌ రవి, డీజీఎం రాజగోపాల్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర కార్మిక ప్రాంతీయ కమిషనర్‌ కార్యాలయంలో ఏఎల్‌సీ శాశ్వతిరెడ్డి సమక్షంలో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story