Sathupally: సత్తుపల్లిలో దారుణం అత్తను హత్య చేసిన అల్లుడు మృతదేహం దహనం
Sathupally: తుమ్మూరులో దారుణం జరిగింది. మూడ్రోజుల క్రితం అదృశ్యమైన వెదుళ్ల నరసమ్మను అల్లుడే హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Sathupally: సత్తుపల్లిలో దారుణం అత్తను హత్య చేసిన అల్లుడు మృతదేహం దహనం
Sathupally: తుమ్మూరు గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నరసమ్మ అదృశ్యం వెనుక ఆమె అల్లుడు తిరుపతిరావుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.నరసమ్మకు చెందిన ఆస్తి విషయంలో వివాదం ఉండటంతో ఆస్తి వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే నరసమ్మ కుటుంబ సభ్యులు మాత్రం మరో కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తిరుపతిరావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని.. ఈ విషయం నరసమ్మకు తెలియడంతో ఆమె తన కుమార్తెతో కలిసి అల్లుడు తిరుపతిరావును మందలించారని ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న తిరుపతిరావు నరసమ్మను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తిరుపతిరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు.. క్లూస్ టీమ్‌తో కలిసి నరసమ్మ మృతదేహం కోసం గ్రామ శివారులోని ప్రాంతాల్లో గాలించారు. నారాయణపురం గ్రామ శివారులోని చెత్త ప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టిన ఆనవాళ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అక్కడ లభించిన బూడిదలోని ఎముకలను పోలీసులు సేకరించారు. వాటిని తదుపరి పరీక్షలకు పంపనున్నట్లు తెలుస్తుంది.
అసలు నరసమ్మ హత్యకు కారణం ఆస్తి వివాదమేనా..? లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న అక్రమ సంబంధం వ్యవహారమేనా..? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది...హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో తుమ్మూరు గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.




