Charla: చర్లలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలు ప్రారంభం!
Charla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూజారిగూడెంలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలను ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ప్రారంభించారు.
Charla: చర్లలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలు ప్రారంభం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలోని పూజారిగూడెం శివార్లలో సోమవారం నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా అండర్-17 బాలుర రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకొని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్-17 బాలుర జట్లు పాల్గొంటున్నాయి.
అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, అవసరమైన సదుపాయాలు కల్పిస్తే క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (SCA) నిధుల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.75 లక్షల వ్యయంతో పూజారిగూడెం శివార్లలో ఈ క్రీడా మైదానాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖతో పాటు స్థానిక ప్రజలు, కాంట్రాక్టర్ల సహకారంతో ఈ మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మైదానం నిర్మాణం పూర్తయిన అనంతరం తొలిసారిగా సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలవడం సంతోషకరమని తెలిపారు. ఈ మైదానం చర్ల ప్రాంత యువతకు క్రీడా సాధనకు మంచి వేదికగా నిలవడమే కాకుండా, పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు శారీరక దారుఢ్య పరీక్షలకు ప్రాక్టీస్ చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత విద్య, క్రీడలు, ఉద్యోగాలు తదితర అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు అందించడంలో పోలీస్ అధికారులు చేస్తున్న కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని, ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, క్రీడా నిర్వాహకులు, కోచ్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




