Kothagudem: ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని!

Kothagudem: ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండి వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ఆదేశించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Nov 2026 7:36 PM IST
Kothagudem
X

Kothagudem: ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని!

కొత్తగూడెం: ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెరువులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పొదుపుగా వినియోగించుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

నియోజకవర్గ పరిధిలో పనిచేయని బోర్లు, చేతిపంపులను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా వ్యవసాయ అవసరాలకు సాగునీటి లభ్యతపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, పశువులకు తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, రాబోయే వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM