Kothagudem: హామీల అమలులో సంఘాల వైఫల్యం టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ!
Kothagudem: సింగరేణి కార్మికులకు ఇచ్చి అమలు చేయని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హామీలపై టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ తీవ్ర ఆగ్రహం. సెప్టెంబర్‌లోగా 40% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్.
Kothagudem: హామీల అమలులో సంఘాల వైఫల్యం టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ!
Kothagudem: సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులను ఆకట్టుకునేందుకు కొన్ని యూనియన్లు జిమ్మిక్కులు చేస్తున్నాయని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఆరోపించారు. శనివారం కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాయని కాపు కృష్ణ తెలిపారు. ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ కార్మికులకు 48 హామీలు, ఐఎన్‌టీయూసీ 36 హామీలు ఇచ్చాయని పేర్కొన్నారు. అయితే రెండేళ్ల ఎనిమిది నెలలు గడిచినా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
ఆర్‌ఎల్‌సీతో చర్చలు జరిపి 23 ప్రధాన డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందంటూ ఏఐటీయూసీ ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. చర్చలు, కమిటీల ఏర్పాటు పేరుతో కాలయాపన చేయడం తప్ప కార్మికులకు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. డిమాండ్లను అంగీకరించామని చెప్పడం మాత్రమే కాకుండా వాటి అమలుకు సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
మెడికల్ బోర్డులపై విమర్శలు
టీబీజీకేఎస్ హయాంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి మెడికల్ బోర్డులు నిర్వహించి, 80 నుంచి 90 శాతం వరకు అన్ఫిట్ కేసులను పరిష్కరించేవారని కాపు కృష్ణ తెలిపారు. సుమారు 14 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు, 650 మందికి ఓర్ మెన్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రమోషన్ల కోసం జేఎంఈటీలు రిలే నిరాహార దీక్షలు చేపడితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు.
ఏఐటీయూసీ నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని, 100 శాతం అన్ఫిట్ కేసులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే రెండున్నరేళ్ల కాలంలో రెండు మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహించారని విమర్శించారు. ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డుకు 120 మంది హాజరైతే కేవలం 12 మందిని మాత్రమే అన్ఫిట్‌గా ప్రకటించారని, అంటే 10 శాతం మందికే అన్ఫిట్ ఇచ్చారని పేర్కొన్నారు.
హామీలు అమలు చేయాలని డిమాండ్, కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణాలు, మారుపేర్ల సమస్య పరిష్కారం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రద్దు వంటి హామీలు కూడా అమలుకు నోచుకోలేదని కాపు కృష్ణ ఆరోపించారు.
ఎండీ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లలో కేవలం రెండు సమావేశాలే నిర్వహించారని విమర్శించారు. సమావేశాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం తప్ప కార్మికులకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.
గోదావరిఖనిలో అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఏఐటీయూసీ ఏకపక్షంగా ఆర్‌ఎల్‌సీకి సమ్మె నోటీసు ఇచ్చిందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్య చేపట్టారని విమర్శించారు.
సెప్టెంబర్‌లోగా 40 శాతం లాభాల వాటా ఇవ్వాలి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి లాభాలను ప్రకటించి కార్మికులకు బోనస్, లాభాల వాటా చెల్లించేవారని కాపు కృష్ణ తెలిపారు. రూ.6 వేల కోట్ల లాభాలను ప్రకటించి, అందులో రూ.4 వేల కోట్లను పక్కన పెట్టి మిగిలిన రూ.2 వేల కోట్ల ఆధారంగా కార్మికులకు 34 శాతం లాభాల వాటా ఇచ్చారని విమర్శించారు.
ప్రస్తుత సింగరేణి యాజమాన్యం సెప్టెంబర్‌లోగా లాభాలను ప్రకటించాలని, ఎలాంటి కటింగులు లేకుండా ప్రకటించిన లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, మారుపేర్ల సమస్య, పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూనియన్లు చేస్తున్న ప్రచారాలు, హామీలను కార్మిక వర్గం గమనిస్తోందని కాపు కృష్ణ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాసరావు, గడప రాజయ్య, కే.విజయ్‌కుమార్, కంచర్ల శ్రీనివాస్, మారపాక తిరుపతి, రవి వర్మ, ఎం.సూర్యనారాయణ, నెమళ్ల వెంకటేశ్వర్లు, ఎం. శంకర్, జి. దేవ్‌సింగ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.




