Sathupalli: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి!
Sathupalli: తెలంగాణలో భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
Sathupalli: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి!
సత్తుపల్లి: రాష్ట్రంలోని రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి చట్టం లక్ష్యమని, రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజాయితీతో పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
గురువారం సత్తుపల్లి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో కడాస్ట్రల్, నాన్-కడాస్ట్రల్ గ్రామాల భూ రీ సర్వేపై నిర్వహించిన రైతుల ముఖాముఖి, ప్రత్యేక అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని భేతుపల్లి, రామానగరం, తాళ్లమడ, గంగారం, నారాయణపురం, రామగోవిందపురం, పాకాలగూడెం గ్రామాల పంచాయతీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూ రీ సర్వే ప్రక్రియ, భూ హక్కుల నమోదుపై తమకు ఉన్న సందేహాలు, సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ భేతుపల్లి రెవెన్యూ గ్రామంలో గత 25 రోజులుగా సుమారు 6 వేల ఎకరాల భూ రీ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. భేతుపల్లి రెవెన్యూ గ్రామంలో మొత్తం 12,047 ఎకరాల భూమి ఉందని, మొత్తం భూమికి రీ సర్వే నిర్వహిస్తున్నా మని చెప్పారు. మిగిలిన మరో 6 వేల ఎకరాల భూమికి కూడా రీ సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. రీ సర్వే సందర్భంగా రైతులకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు లేదా లోపాలు కనిపిస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. రీ సర్వేలో ఏదైనా తప్పు జరిగితే రైతులు ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.
వ్యవసాయ భూములకు వెళ్లే దారులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పొలాలకు వెళ్లే దారులకు పట్టాలు ఇవ్వొద్దని, దారులను రైతుల భూముల్లో భాగంగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన అప్రోచ్ రోడ్లు, దారులను పరిరక్షించాలని సూచించారు. చెరువులను తప్పనిసరిగా పరిరక్షించాలని మంత్రి అన్నారు. చెరువులకు అవసరమైన హద్దులు, రక్షణ చర్యలు, కాంపౌండ్ నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. చెరువులను పరిరక్షిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
భేతుపల్లి రెవెన్యూ గ్రామంలో మొత్తం 12,047 ఎకరాల భూమి ఉండగా, సుమారు 2,026 ఎకరాలు అసైన్డ్ భూములుగా ఉన్నాయని ఇందులో సుమారు 980 ఎకరాలను పేదలకు అందించినట్లు చెప్పారు. ఇంకా సుమారు వెయ్యి ఎకరాల అసైన్డ్ భూముల్లో కొంతమంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ వారికి పట్టాలు లేవని వివరించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు ఎక్కడా కోల్పోవని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులకు భూమిపై హక్కులు కల్పించే ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో నిజంగా భూమిపై ఉన్న రైతులకు హక్కులు దక్కలేదని మంత్రి అన్నారు. భూములు లేని కొంతమందికి కూడా రైతుబంధు ప్రయోజనాలు అందిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. నాగార్జునసాగర్ పైలట్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన సర్వేలో సుమారు 3,400 వరకు నకిలీగా గుర్తించిన పట్టాదారు పాస్ బుక్‌లు బయటపడ్డాయని చెప్పారు. భూమి రైతులకు అత్యంత భావోద్వేగంతో కూడుకున్న అంశమని, ఇది రాజకీయ అంశం కాదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. నిజమైన రైతులకు భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
బేతుపల్లి గ్రామం తనకు కొత్త కాదని మంత్రి అన్నారు. గ్రామంలోని భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కూడా గ్రామంలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూ రీ సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి రైతు భూమికి ఖచ్చితమైన కోఆర్డినేట్లు, మ్యాప్ రూపొందించి, భూ హక్కులను నమోదు చేస్తామని చెప్పారు. రైతులు తుది టైటిల్స్ కోసం ఎదురుచూస్తున్నారని, రీ సర్వే పూర్తయిన తర్వాత ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసి తుది హక్కులు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా భూ రీ సర్వే మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రీ సర్వే పూర్తయిన తర్వాత 30 రోజుల పాటు రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాతే తుది హక్కులను నమోదు చేస్తామని చెప్పారు. మనుషులకు ఆధార్ కార్డులు ఉన్నట్లుగా రైతుల భూములకు కూడా భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు.
రీ సర్వేలో ప్రతిరోజూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భేతుపల్లిలో కూడా ఇదే విధానంలో రీ సర్వే జరుగుతోందని తెలిపారు. రీ సర్వే సమయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రైతులు వాటిని అధికారుల దృష్టికి తీసుకువస్తే సరిచేసి తుది ప్రక్రియలో చేర్చుతామని అన్నారు. భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిందని, చిత్తశుద్ధి, నిజాయితీతో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రజలకు, రైతులకు తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, నిజాయితీ ఏమిటో తెలుసని అన్నారు. గత ప్రభుత్వం ధరణికి సంబంధించి నిబంధనలు కూడా పూర్తిస్థాయిలో రూపొందించలేదని మంత్రి విమర్శించారు. భూభారతి చట్టానికి మాత్రం కేవలం మూడు నెలల్లోనే నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు.
భూభారతిచట్టం రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా తాను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నానని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు త్వరలోనే వారికి మరోసారి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
రైతులే తమకు అత్యంత ముఖ్యమని, రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టి సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసినా తాము పట్టించుకో బోమని మంత్రి అన్నారు. భూభారతి చట్టం రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయిలో అమలును పరిశీలిస్తానని చెప్పారు.
భూభారతి చట్టం రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజల తీర్పుకు రెఫరెండంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. కొంతమంది భూ ఆక్రమణదారులు అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని 22ఏ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే వారిపై చర్యలు ప్రారంభించామని తెలిపారు.
సామాన్య ప్రజలను ముందు పెట్టి అక్రమంగా దోచుకున్న భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించబోవని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పనిచేసి రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి భూ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
స్థానిక నాయకులు దయానంద్ మాట్లాడుతూ ధరణి కారణంగా అనేక మంది రైతులు భూ సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్తుపల్లి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. ప్రతి రోజూ సుమారు 200 నుంచి 300 ఎకరాల వరకు భూ రీ సర్వే జరుగుతోందని, ఇప్పటి వరకు సుమారు 6 వేల ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. భవిష్యత్తులో మరో 6 వేల ఎకరాల భూమికి సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు.
ధరణి సమయంలో భూములు లేని కొంత మంది కూడా నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు పొందినట్లు గుర్తించామని, అర్హత లేని పాస్‌బుక్‌లను రద్దు చేసి వాటి ఆధారంగా పొందిన రైతుబంధు మొత్తాలను రికవరీ చేయాలని దయానంద్ కోరారు. భూ రీ సర్వేలో రైతులు రెవెన్యూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. రైతులు మాట్లాడుతూ భూ రీ సర్వే పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. పొరుగు రైతుల సమ్మతితోనే భూముల హద్దులను నిర్ణయిస్తున్నారని చెప్పారు. భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉండటంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని, అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు మంత్రిని కోరారు.
యెనుకట్లలోని 33 ఎకరాల చెరువును కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చెరువును పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, చెరువును రక్షిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. పొలాలకు వెళ్లే దారుల కోసం కొంతమంది సర్వే చేస్తున్నారని, ఆ దారులను పట్టాదారు పాస్‌బుక్‌లో భూమిగా నమోదు చేయకుండా చూడాలని కోరారు. కిష్టాపురం గ్రామంలోని సర్వే నంబర్ 263లో 721 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 811 ఎకరాలు పంపిణీ చేసినట్లు నమోదైందని రైతులు తెలిపారు. 90 ఎకరాల అదనపు కేటాయింపుపై విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఇ శ్రీనివాస చారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




