Kothagudem: బీఆర్ఎస్ రీడిజైన్ దోపిడీపై భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫైర్!

Kothagudem: సీతమ్మసాగర్ లిఫ్టు ఇరిగేషన్ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 16 July 2026 5:19 PM IST
Kothagudem
X

Kothagudem: బీఆర్ఎస్ రీడిజైన్ దోపిడీపై భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫైర్!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్ వద్ద తెలంగాణ మంత్రులు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సీతమ్మ సాగర్ లిఫ్టు ఇరిగేషన్ పనులను పరిశీలించారు.

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.సీతమ్మసాగర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో లక్షల ఎకరాలకు నీరందించేలా రూపొందించగా... బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పనులను సక్రమంగా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సీతారామ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను పక్కనబెట్టి, ప్రాజెక్టును పూర్తి చేయడంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు సరైన సమయంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు విమర్శలు చేయడం కంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను చూసి నేర్చుకోవాలని సూచించారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినా ఫలితాలు కనిపించలేదన్నారు. గోదావరి జలాలను వచ్చే పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మెడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలను ప్రస్తావిస్తూ... నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కమిషన్ల కోసం కాకుండా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వం రాజకీయాలు చేయదని, రైతులకు సాగునీరు అందించడమే ఏకైక లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA