Kothagudem: కొత్తగూడెంలో పెన్షన్ విద్రోహ దినం: సీపీఎస్ రద్దుకు TGEJAC డిమాండ్
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ‘పెన్షన్ విద్రోహ దినం’ సందర్భంగా TGEJAC ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Kothagudem: కొత్తగూడెంలో పెన్షన్ విద్రోహ దినం: సీపీఎస్ రద్దుకు TGEJAC డిమాండ్
కొత్తగూడెం: CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించడంతో పాటు ఉద్యోగుల పెన్షన్ భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని TGEJAC భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 “పెన్షన్ విద్రోహ దినం” సందర్భంగా మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ IDOC వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని CPS రద్దు, OPS పునరుద్ధరణ కోరుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా TGEJAC చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే వరం కాదని, ప్రభుత్వ సేవలో జీవితాంతం పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం కోసం అవసరమైన సామాజిక భద్రత, హక్కు అని పేర్కొన్నారు. CPS విధానంలో పెన్షన్ ప్రయోజనాలు పెట్టుబడుల రాబడిపై ఆధారపడటంతో ఉద్యోగుల భవిష్యత్తులో అనిశ్చితి ఏర్పడుతోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే PRC అమలు, పెండింగ్ DAల విడుదల, మెరుగైన ఆరోగ్య పథకం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
TGEJAC రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా జేఏసీ నాయకులు ఎం. వెంకటేశ్వరరావు, వెస్లీ, లాల్ మహమ్మద్, తుక్కాని శ్రీనివాసరెడ్డి, హరిలాల్, లక్ష్మణ్ నాయక్, వనమా శ్రీనివాసరావు, డి.వి. దినేష్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు కృష్ణయ్య, దస్రు, రాణి, రమేష్, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, శ్రీనివాసరావుతో పాటు ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




