Kothagudem: రోడ్డు లేదు: అడవిలోనే అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

Kothagudem: భద్రాద్రి జిల్లాలో రోడ్డు లేక అడవిలోనే అంబులెన్స్‌లో ఆదివాసీ మహిళ ప్రసవించింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తికి ప్రశంసలు, పాలకులపై జనం ఆగ్రహం.

G Ravi, Bhadradri
Published on: 27 July 2026 11:40 AM IST
Kothagudem
X

Kothagudem: రోడ్డు లేదు: అడవిలోనే అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

'రోడ్డు లేని ఆదివాసి బతుకు'.. మార్గంమధ్యలోనే గర్భిణీ ప్రసవం పాలకుల నిర్లక్ష్యంపై చింతకుంట ప్రజల ఆగ్రహం...

​భద్రాద్రి కొత్తగూడెం (బూర్గంపాడు మండల):

రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇచ్చే హామీలు గిరిజన గ్రామాల్లో ఏమాత్రం అమలు కావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామానికి చెందిన సోడి మార్త (30) అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే, గ్రామానికి ఉన్న ఒకే ఒక్క రోడ్డు గుంతలమయంగా మారి, కనీసం రాకపోకలు కుడా నోచుకోని దుస్థితి. ఏర్పడింది.​మృత్యువుతో పోరాటం.. అడవిలోనే డెలివరీ:

రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో అంబులెన్స్ పైలట్ విజయభాస్కర్ ఎంతో చాకచక్యంగా వాహనాన్ని నడుపుతూ గ్రామానికి చేరుకున్నారు. నిండు గర్భిణీని అంబులెన్స్‌లోకి ఎక్కించుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా, రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా వాహనం కుదుపులకు గురై ఆమెకు నొప్పులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లే సమయం లేకపోవడంతో, సిబ్బంది సమీపంలోని అడవి ప్రాంతంలోనే అంబులెన్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) రాధ ప్రాణాలకు తెగించి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. మార్త పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించామని మెడికల్ టీమ్ తెలిపింది.

​ఓట్ల వేటలో రాజకీయ నాయకులు.. రోడ్ల వేటలో ప్రజలు!

ఈ ఘటనపై చింతకుంట గ్రామస్థులు, ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులు కార్లలో వచ్చి హామీల వర్షం కురిపిస్తారు.. గెలిచాక మా మొహం కూడా చూడరు" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గర్భిణీలకు సకాలంలో వైద్యం అందేలా రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని ఈ రాజకీయ/పాలనా వ్యవస్థ దేనికి సంకేతం? అని ప్రశ్నిస్తున్నారు.

​ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది రాధ, విజయభాస్కర్‌ల సమయస్ఫూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పటికీ.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా రేపు మరో గర్భిణీకి ఇలాంటి పరిస్థితి రాకూడదని, వెంటనే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని చింతకుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు...

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story