Kothagudem: కొత్తగూడెం బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కవిత నిప్పులు
Kothagudem: కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అవినీతి సొమ్ము అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్.
Kothagudem: కొత్తగూడెం బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కవిత నిప్పులు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బాయి బాట కార్యక్రమంలో భాగంగా పివికె 5 మైన్ సందర్శించి, కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బిజెపి , బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము అమరవీరుల కుటుంబాలకు పంచాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్ళను. మా పార్టీతో భయం లేదంటూనే ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ ఇచ్చారు. నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలతో చేతులు కలుపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా? తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతామని హెచ్చరించారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ కు క్విడ్ ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని, కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీశ్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోందనన్నారు.
ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడదని స్పష్టమైందన్నారు చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట అంటూ హరీష్ రావుని విమర్శించారు. ముఖ్యమంత్రికి నీళ్ల సోయి లేదు. బీఆర్ఎస్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయటం లేదన్నారు. అర కిలోమీటర్ రాళ్ల కట్ట కడితే మొత్తం నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని సూచించారు.
తాడిచర్ల-2 మైనింగ్ కేటాయించి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని, నిజాం రాసిచ్చిన 17 గనుల్లో ఇంకా 16 గనులు బేషరుతుగా సింగరేణికి ఇచ్చేయాలన్నారు. నేను పార్టీ పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటి వరకు బీఆర్ఎస్ విషయంలో ఎక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడలేదని తెలిపారు. పార్టీ పెట్టిన ఆరు నెలల వరకు అన్ని పార్టీల గురించి మాట్లాడి, ఆతర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాని తెలిపారు.
కానీ నా పార్టీతో భయం లేదంటూనే బీఆర్ఎస్ వాళ్లు వెయ్యికి పైగా ఈసీకి కంప్లైంట్స్ ఇచ్చారని విమర్శించారు. మా పార్టీకి సంబంధించిన వార్తలు రాయొద్దని చెబుతున్నారని విమర్శించారు. అదే విధంగా 188 కోట్లు పెట్టి కేటీఆర్ ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ ను కొనుగోలు చేశారని తెలిపారు.
క్విడ్ ప్రొ కో లో భాగంగా తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్ కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చాడు. డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావులను విమర్శించారు.
అసలు బీఆర్ఎస్ పార్టీకి నీతి, నియమం, ఒక విధానం అంటూ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీ తన విధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా, మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారని, మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా అంటూ ప్రశ్నించారు.
అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 14 వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చిన అవినీతి సొమ్మన్నారు. మీ పార్టీలో అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేసారు. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా?
ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడండని సవాల్ చేశారు. నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేదే లేదని తెగేసి చెప్పారు.
ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా? ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా మళ్లీ పట్టించుకోవటం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోంది.
అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది. కచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన భూములన్నింటిపైన రివ్యూ చేస్తాం. మొత్తం అవినీతిని కక్కిస్తాం. ఎవరినీ కూడా వదలిపెట్టమని హెచ్చరించారు.
ఈ రెండు పార్టీలకు అసలు ప్రజా అజెండా అనేదే లేదని,కేవలం దోచుకోవటం మీద దృష్టి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత వారికి న్యాయం జరగాలని నేను బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడాను. అప్పుడు కూడా ఉద్యమకారులు, కార్మికుల కోసం నేను ఫైట్ చేశాను. కార్మికులతో ఎవరున్నారో, కాంట్రాక్టర్లతో ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు.
బీఆర్ఎస్ లో ఉండి కూడా ఉద్యమకారుల కోసం వారి పక్షాన నిలబడ్డానని, కానీ వారికి అన్యాయం జరిగింది. అందుకే చాలా ఆవేదనతో చెబుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లను మా నిజామాబాద్ లోకి రానివ్వలేదు. ఉద్యమకారులకు, తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేందుకు ఫైట్ చేశాను.
కానీ ఇవ్వాళ హరీష్ రావు మాత్రం నారాయణ, చైతన్య సంస్థలకు పాలు అమ్ముకుంటున్నాడని తీవ్రంగా విమర్శించారు. 500 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు విజయ డైయిరీ నుంచే పాలు పోసేలా ప్రభుత్వం ఆర్డర్ తేవాలని సూచించారు. తిన్నది సరిపోతలేదని ఇంకా మూడు నెలల పాటు పదవి కావాలని హరీష్ రావు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోతలేదా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ కు కూడా అన్యాయం చేసింది ఆ గుంటనక్కనే అంటూ హరీష్ రావు పై విమర్శలు చేశారు. ఎవరైతే అవినీతి చేశారో ఆయననే ముందు పెట్టి కాళేశ్వరం అంశాన్ని ఈ ప్రభుత్వం మాట్లాడిస్తోందని, ఇంకా జన్మలో బీఆర్ఎస్ అనే పార్టీ బాగుపడదన్నారు.
టీఆర్ఎస్ అని వచ్చిన పేరును పోగొట్టాలని చూస్తున్నారని, దేవుడు, ధర్మం నా పక్షాన ఉందన్నారు. ఖచ్చితంగా మేము ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. నేను చేసిన ఆరోపణలపై మాట్లాడే దమ్ము లేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయిస్తున్నారు. తల్లి, చెల్లి అనే ఇంగితం మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యంత ఎక్కువ మంది యూత్ మా పార్టీలో ఉన్నారని,మేము ఎప్పుడు కూడా బూతులు తిట్టాలని వాళ్లకు చెప్పటం లేదన్నారు. తల్లి, చెల్లి అనే ఇంగితం లేకుండా బూతులు తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు? కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతామని బీఆర్ఎస్ సోషల్ మీడియాను హెచ్చరించారు.
ప్రజా సమస్యలు వదిలి, పర్సనల్ గా ఆటాక్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం అలా చేయనని తెలిపారు. పదవులు ఉంటేనే పోరాటం చేస్తాం, ప్రతిపక్షం లో ఉంటే చేయం అన్న విధంగా నేను లేను. మాకు పార్టీ ఉండటమే పవర్. పార్టీ పెట్టిన 73 రోజుల్లోనే మేము ఆ పవర్ ఏంటో చూపించామన్నారు.
మేము చేసిన పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని డైవర్ట్ చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని తీసుకొచ్చిందన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రికి నీటి మీద కనీస అవగాహన లేదు. అధికారులు చెప్పిందే మాట్లాడతాడు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల ద్వారా కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి పోసుకోవచ్చు. కానీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారు. చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలను మభ్య పెట్టి మోసం చేస్తున్నారు. పైగా రేపు ఖమ్మంలో సభ పెట్టి రైతు భరోసా వేస్తామని చెబుతున్నారు.
ప్రజలు వీళ్లకు ఒకేసారి ఓట్లు వేస్తే...వీళ్లు మాత్రం పెన్షన్లు, రైతు భరోసా ఇన్ స్టాల్ మెంట్లలో ఇస్తున్నారని విమర్శించారు. మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. రెండు సార్లు సగమే వేశారు. యూరియ కోసం యాప్ వద్దని మేము పోరాటం చేస్తే.. ఇప్పుడు మీ సేవ అంటున్నారు. అంటే రైతులు అన్ని వదిలేసి మీ సేవ చుట్టు తిరగాలా? రైతుల మీద ఎందుకు ఈ పిచ్చి ప్రయోగాలని ప్రశ్నించారు.
ఎన్నికల సందర్భంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడు రకాలకే బోనస్ అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. ఖమ్మంలో సభ పెడతామంటున్న ముఖ్యమంత్రి, మంత్రులను కొత్తగూడెం ప్రజల తరఫున అడుగుతున్నా? నీటి ప్రాజెక్ట్ లకు సంబంధించి అన్ని హెడ్ వర్క్స్ కొత్తగూడెంలో ఉంటే ఖమ్మంకు నీళ్లు పోతున్నాయి.
మరీ కొత్తగూడెం సహా మిగతా నియోజకవర్గాలకు నీళ్లు వద్దా? ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు. కానీ ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనే 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మంది రైతులపై రౌడీ షీట్లు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. రైతులపై రౌడీ షీట్ తెరుస్తారా? వెంటనే ఆ కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి గారు మహబూబ్ నగర్ లో పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. 10 వేల మంది మహిళలు ఫ్యాక్టరీ వద్దని ధర్నా చేస్తే వారిలో 90 మంది పై అక్రమ కేసులు పెట్టారని, 9 మంది పై రౌడీ షీట్ ఓపెన్ చేశారని, ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా భూమిలో విషయం నింపే పార్థసారధియే మళ్లీ క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడన్నారు.
బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలని కోరుతున్నాని, ఖమ్మంలో రైతు సభ జరిగే లోపు మహబూబ్ నగర్ లో రైతులపై పెట్టిన కేసులు, రౌడీ షీట్లను తొలగించాలన్నారు. ఇక సింగరేణి కోసం నేను ఉద్యమంలో, ప్రభుత్వంలో పనిచేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. సింగరేణి లో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్ అనే హెల్త్ మిక్స్ ఉండాలి. అప్పుడే సంస్థ బాగుంటుంది.
ఇవ్వాళ సింగరేణి ఇబ్బందుల్లో ఉండటానికి ఈ ప్రభుత్వమే కారణం. సంస్థకు ఇవ్వాల్సిన 54 వేల కోట్లు ఇవ్వకపోవటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కార్మికులు పనిముట్లు అడిగితే పైసలు లేవంటున్నారు. కార్మికుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? సింగరేణిలో వన్ విజన్, వన్ ఫ్యామిలీ అంటారు. కానీ ఆఫీసర్లకు ఒక రూల్, కార్మికులకు ఒక రూల్ నడుస్తోందన్నారు.
సింగరేణికి నిజాం గారు 17 గనులను రాసిచ్చారు. కానీ యూపీఏ హయాంలో జరిగిన భూ కుంభకోణం కారణంగా బీజేపీ బొగ్గు గనులను జాతీయం చేసిందని, దీంతో మన 17 బొగ్గు గనులను కేంద్రం లాక్కుందన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డనే అయితే సింగరేణికి టెండర్లు లేకుండా గనులు ఇవ్వాలని, నేను మొదటి దఫా బాయి బాటలో డిమాండ్ చేశాను, దీంతో ఒక మైనింగ్ ఇచ్చి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మిగతా 16 గనులను కూడా ఇవ్వాలన్నారు.
బీజేపీ నిర్లక్ష్యం కారణంగా సింగరేణి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతోంది. సింగరేణికి ఇచ్చిన తాడిచర్ల-2 సింగరేణియే ఆపరేట్ చేసేలా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కార్మికులకు న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ సంస్థకు ఇస్తే వాళ్లు వేరే రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొస్తారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. ముఖ్యమంత్రి బావమరిదికి సత్తుపల్లిలో ఉన్న మైన్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. వాళ్లు ఉద్యోగాల కోసం అడుక్కోవాలా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్ల-1 మైనింగ్ ను దొడ్డిదారిన ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటంతో కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. సింగరేణిలో 62 వేల మంది కార్మికులు, ఆఫీసర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 38 వేలకు పడిపోయింది. సింగరేణిలో డింపెడెంట్ ఉద్యోగాలు వచ్చేలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఎంతో కృషి చేశాను. కానీ ఇప్పుడు దాన్ని నాశనం చేశారు. డబ్బు ఇచ్చిన వాళ్లకే అన్ ఫిట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఖచ్చితంగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్ లో ఉన్న డింపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలి. మెడికల్ బోర్డు పెట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా అని హెచ్చరించటంతో మెడికల్ బోర్డు పెడతామంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు. కానీ ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
సింగరేణి కార్మికుల కోసం ప్రాణాలకు తెగించి మేము పోరాటం చేసి చూపిస్తాం. అలియాస్ పేర్ల విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నారు. 10వ తరగతి లేదని అంటూ వేధిస్తున్నారు. సింగరేణిలో చదువుతో సంబంధం లేదు. అలియాస్ పేర్ల సమస్య ను వెంటనే తీర్చాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు మెడికల్ బోర్డు, కార్మికుల సొంతింటికలపై మాట్లాడటం లేదు.
కేంద్రం 25 లేబర్ చట్టాలను 4 కు కుదించి అన్యాయం చేస్తుంటే పట్టించుకోవటం లేదు. ఎర్రజెండా వేసుకొని కాంగ్రెస్ తో అలయ్ బలయ్ చేసుకొని ఆయన సొంత అజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించండి.
అప్పుడు మాత్రమే మేము మీ చిత్తశుద్ధిని, మీరు కార్మికుల కోసం మాట్లాడుతున్నారని నమ్మాల్సి ఉంటుందని పూనంనేని సాంబశివరావునుద్దేశించి అన్నారు.




