Tekulapally: టేకులపల్లి ఎంఈఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు: టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

Tekulapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సెన్సెస్-2027 విధుల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగాయని టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 May 2026 3:53 PM IST
Tekulapally
X

Tekulapally: టేకులపల్లి ఎంఈఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు: టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

Tekulapally: టేకులపల్లి మండల విద్యాశాఖాధికారి ఎ. జగన్ సెన్సెస్-2027 విధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకుండా ఇష్టానుసారంగా డ్యూటీలు కేటాయించారని టీఎస్ యూటీఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ ఆరోపించింది. సీనియారిటీ జాబితా ఇవ్వకుండా 1997, 1998, 2000 డీఎస్సీ సీనియర్ ఉపాధ్యాయులను పక్కనపెట్టి జూనియర్లకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారని పేర్కొంది. 2024 ప్రమోషన్ పొందిన వారికి సూపర్వైజర్ డ్యూటీలు ఇవ్వడం, ఇటీవలే సస్పెన్షన్ గురై మండలం లో ఒక పాఠశాలనందు జాయిన్ అయిన ఉపాధ్యాయుడికి సూపర్వైజర్ డ్యూటీ కేటాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మండలంలోని కొన్ని పాఠశాలల నుండి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులకు జనగణన విధులు కేటాయించడంతో పాఠశాలల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి పరీక్షలు ఉండటంతో విద్యార్థుల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్కో పాఠశాల నుండి ఒక్కరికి విధులు ఇచ్చి ఉంటే నిర్వహణలో ఇబ్బందులు ఉండేవి కావని పేర్కొన్నారు. కొంతమంది ఎన్యూమరేటర్లకు 2 నుంచి 3 బ్లాకులు, అవి కూడా వేర్వేరు గ్రామపంచాయతీల్లో కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జనగణన సర్వే ప్రారంభమైన పది రోజుల తర్వాత కూడా బ్లాక్ రూట్ మ్యాప్ మారిందంటూ తాహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి అదనపు ఇండ్ల గణన చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎంఇఓ ఉద్దేశపూర్వకంగానే కొంతమంది మహిళా ఉపాధ్యాయులకు వారు పని చేసే పాఠశాలల నుంచి సుమారు 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో విధులు కేటాయించడం జరిగింది.

కాబట్టి సెన్సెస్-2027 విధుల కేటాయింపులో సీనియారిటీ పాటించకుండా అవకతవకలకు పాల్పడిన టేకులపల్లి మండల విద్యాశాఖాధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. వినతి పత్రం సమర్పించిన వారిలో టేకులపల్లి మండల అధ్యక్షులు హరికుమార్ ప్రధాన కార్యదర్శి టి. లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు బి. కిషోర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య, జిల్లా కార్యదర్శి హాతీరామ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వీరన్న, మండల ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ రామచంద్ర రావు చందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story