Kothagudem: కార్తీక మాసంలో తులసీ దామోదర కళ్యాణం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయం!
Kothagudem: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తులసీ దామోదర కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Kothagudem: కార్తీక మాసంలో తులసీ దామోదర కళ్యాణం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయం!
Kothagudem: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తులసీ దామోదర కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
కార్తీక మాసంలో తులసీ దామోదర కళ్యాణానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను మహాలక్ష్మీ స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దామోదరుడు శ్రీమహావిష్ణువు రూపం. తులసి, దామోదరుల కళ్యాణం నిర్వహించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి పూజ, దీపారాధన, విష్ణు ఆరాధన చేయడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు పేర్కొంటాయి.
ఈ సందర్భంగా ఆలయంలో తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మరిగంటి శాయి గోపాలచార్యులు పూజా విధానం, తులసీ దామోదర కళ్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తుల చేత సంప్రదాయబద్ధంగా పూజలు చేయించారు.
ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తి గీతాలు, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసంలో తులసీ దామోదర కళ్యాణంలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.




