Vemsoor: లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేసిన మంత్రి పొంగులేటి
Vemsoor: వేంసూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డిల చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు.
Vemsoor: లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేసిన మంత్రి పొంగులేటి
వేంసూరు: ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కష్టాన్ని తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి వేంసూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల పక్షపాతి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి దీవించిన ఈ ప్రజా ప్రభుత్వం నిరుపేదల కష్టాన్ని ప్రత్యక్షంగా ఎరిగిన ప్రభుత్వమని అన్నారు. పేదవాడికి ఏం కావాలో గుర్తించి, వారి గుమ్మానికే సంక్షేమ పథకాలను చేరుస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు
గత పదేళ్ల పాలనలో కమీషన్ల కోసం లక్షల కోట్లను కాళేశ్వరంలో కుమ్మరించారే తప్ప, పేదవాడి సొంతింటి కలను నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు, హైదరాబాద్ పట్టణానికి లక్ష ఇళ్లను మంజూరు చేశామన్నారు. మొత్తం 8 లక్షల ఇళ్లకు గాను, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున సుమారు రూ. 40,000 కోట్లతో పేద ఆడబిడ్డలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. ఎటువంటి కుల, మత, రాజకీయ పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3వ, 4వ విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను అందించి తీరుతామని స్పష్టం చేశారు.
రైతును రాజును చేయడమే తమ ధ్యేయమని మంత్రి తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12,000 రెండు విడతల్లో అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని భయపెడితే, తమ ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 అదనపు బోనస్ ఇచ్చిందని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రైతుల పంటలు ఎండకూడదని యూనిట్ రూ. 15 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసి మరీ మొదటి పంటను పండించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
ఆడబిడ్డలకు ఉచిత పథకాలు, వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ, పేదింటి ఆడబిడ్డలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు పెద్దోళ్ళు తినే సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. గత తొమ్మిదిన్నరేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే, తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. కోటి మంది డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో గడిచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించామని అన్నారు.
గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు ఇస్తే, తమ ప్రభుత్వం మొదటి విడతలో పాలపిట్ట రంగు చీరలు ఇచ్చిందని, రేపు 19వ తేదీన రెండో విడతలో చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరలను ఆడబిడ్డలకు కానుకగా అందిస్తున్నామని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 73 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
చేయూత పింఛనుల మంజూరులో భాగంగా వేంసూరు మండలంలో వితంతువులు, వివిధ వృత్తుల వారికి కలిపి కొత్తగా 686 మందికి చేయూత పింఛన్లను మంజూరు చేశామని, మిగిలిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు అందిస్తామని అన్నారు. కొత్త వాటితో కలుపుకొని కేవలం వేంసూరు మండలంలోనే ప్రతినెలా రూ. 1 కోటి 48 లక్షల రూపాయలను ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండటాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక రోడ్లపై విషం కక్కుతున్నాయని మంత్రి మండిపడ్డారు. గత పదేళ్లలో పేదలకు ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పేదల ఇంటికి చేర్చుతామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న పింఛన్ల పంపిణీ నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని ఎంపీ తెలిపారు. సన్నబియ్యం పంపిణీకి సుమారు రూ. 13 వేల కోట్ల ఖర్చు అవుతోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 7 వేల కోట్ల ఖర్చుతో పాటు, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కింద 60 లక్షల ఇళ్లకు లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు.
ప్రతి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నప్పటికీ, తల తాకట్టుపెట్టి అయినా పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రజా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎంపీ అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఎంపీ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ, మండలంలో ఇంతకుముందు 6,400 పింఛన్లు ఉండగా, అదనంగా మరో 680 పింఛన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా విచారించి, ఎటువంటి లిమిట్లు పెట్టకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈసారి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఎదురుచూస్తున్న అర్హులందరికీ నేడు న్యాయం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గ్రీవెన్స్ రోజుల్లో ప్రతి 10 దరఖాస్తులలో 3 నుంచి 4 దరఖాస్తులు పింఛన్ల కోసమే వచ్చేవని, ప్రస్తుత ఈ చర్య ద్వారా లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించిందని తెలిపారు. వికలాంగుల పింఛన్ కింద రూ.4,016, మిగతా అన్ని రకాల పింఛన్ల కింద రూ.2,016 లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడుతుందని, ఈ మొత్తం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఆత్మగౌరవంతో బ్రతకడానికి తోడ్పడుతుందని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, దాదాపు పదేళ్ల కిందట వచ్చిన పింఛన్లు గత కాలంలో నిలిచిపోయాయని, ప్రజలందరూ ఎంతో ఎదురుచూసిన ఈ పింఛన్లను నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు ఈ పింఛన్లు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే రెండో విడతలో వృద్ధాప్య పింఛన్లు కూడా రానున్నాయని స్పష్టం చేశారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, మిస్ అయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు, ఉచిత కరెంట్, 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు ద్వారా ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. రైతన్నలకు రుణమాఫీ, రైతు భరోసా, సీజన్‌కు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు బోనస్ అందిస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇంచార్జ్ డీఆర్డీవో శిరీష, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుల్ల నరసింహారావు, వైస్ చైర్మన్ కృష్ణార్జున రావు, వేంసూరు మండల తహసీల్దార్ మాణిక్ రావు, ఎంపిడివో బి. రంజిత్ కుమార్, స్థానిక సర్పంచ్ ఫక్రోద్దీన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




