Khammam: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు: కలెక్టర్!
Khammam: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టిఎస్ గురువారం అన్నారు.
Khammam: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు: కలెక్టర్!
ఖమ్మం: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన పోష్ చట్టం–2013 అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు అనేక సందర్భాల్లో బయటకు రావడం లేదని అన్నారు. ఫిర్యాదు చేస్తే వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం, ఇతర కారణాలతో చాలా మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు.
మహిళలు వేధింపులను మౌనంగా భరించకుండా, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
మన ఇంట్లో చెత్తబుట్ట ఉన్నట్లే సమాజంలో కూడా చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారని, అలాంటి వ్యక్తుల వేధింపులను ఏమాత్రం సహించకూడదని కలెక్టర్ అన్నారు. మహిళలు ఎదుర్కొనే వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఒక్క క్షణం ధైర్యం సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వేధింపులను భరించవద్దని స్పష్టం చేశారు.
పోష్ చట్టం ప్రకారం 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (Internal Complaints Committee – ICC) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని పేర్కొన్నారు.
మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేయని పక్షంలో నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. వేధింపులకు గురైన వెంటనే ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేస్తే నిందితులు వివిధ కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారని తెలిపారు.
తాము స్నేహపూర్వకంగానే మాట్లాడామని, తమ ప్రవర్తన వేధింపులుగా భావిస్తారని తెలియదని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేయలేదని వంటి కారణాలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసిన అనంతరం కూడా కొంత మంది బాధిత మహిళలపై రాజీ పడాలని ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి చర్యల వల్ల నిందితులకు తగిన శిక్ష పడకపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర మహిళలు కూడా వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ తెలిపారు.
బాధిత మహిళలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరమైన పరిష్కారం పొందాలని సూచించారు.
పోష్ చట్టం–2013 ప్రధాన ఉద్దేశం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమేనని, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వేధింపులు జరిగినట్లయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవం కంటే ఉద్యోగం, డబ్బు, హోదా ఏవీ ముఖ్యమైనవి కావని పేర్కొన్నారు.
అదే సమయంలో పోష్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది తప్పుడు సమాచారంతో తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, వాస్తవాల ఆధారంగా న్యాయబద్ధమైన విచారణ జరగాలని పేర్కొన్నారు.
పని ప్రదేశాల్లో మహిళలపై ఎలాంటి వేధింపులకూ తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. మహిళా సాధికారత కేంద్రాల నుంచి పూర్తిస్థాయి సహకారం తీసుకుంటూ మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని, వేధింపులకు గురైన మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.
మహిళలకు గౌరవప్రదమైన, సురక్షితమైన పని వాతావరణం కల్పించేందుకు అన్ని సంస్థలు, శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిడిపిఓ విష్ణువందన, డి.హెచ్.ఈ.డబ్ల్యూ సమ్రీన్, సంబంధిత అధికారులు, మహిళలు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.




