Guduru: దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ సస్పెండ్!

Guduru: గూడూరు పరిసర దేవాలయాల ఈవో ముసునూరి రవికృష్ణపై అవినీతి మరియు నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Oct 2026 9:59 AM IST
Guduru
X

Guduru: దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ సస్పెండ్!

Guduru: గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే పలు దేవాలయాలకు ఈవోగా విధులు నిర్వహిస్తున్న ముసునూరి రవికృష్ణపై వచ్చిన అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.

గూడూరు పట్టణంలోని శ్రీ శివాలయం, ధర్మరాజస్వామి దేవస్థానం, చిల్లకూరు మండలం కలవకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలకు సంబంధించిన నిధుల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శివాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కే. దయాకర్ తదితరులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. పీజీఆర్‌ఎస్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కలవకొండ దేవస్థానానికి సంబంధించిన సుమారు రూ.60–70 లక్షల నిధులకు సరైన లెక్కలు లేవని, దేవస్థాన భూముల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నిర్వహించలేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అలాగే దేవాలయాల ఆదాయాన్ని ధర్మకర్తల మండలికి తెలియకుండా నిర్వహించడం, పూజారులు, సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వంటి ఆరోపణలు కూడా చేశారు.

ధర్మరాజస్వామి దేవస్థానం భూముల వేలం వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆ ప్రక్రియను రద్దు చేసి వాయిదా వేసినట్లు సమాచారం. లీజు కాలం పూర్తైన వ్యాపారుల నుంచి అక్రమంగా వసూళ్లకు ప్రయత్నించారనే ఆరోపణలపై కూడా ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.

ఫిర్యాదులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఈవో రవికృష్ణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్