Vijayawada: ఆలయ పునరుద్ధరణపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తామన్న ఈవో!
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శిథిలావస్థలో ఉన్న చారిత్రక శ్రీ పాశుపతేశ్వర స్వామి ఆలయాన్ని ఈవో వి.కె. శీనా నాయక్ బృందం సందర్శించింది.
Vijayawada: ఆలయ పునరుద్ధరణపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తామన్న ఈవో!
Vijayawada: విజయవాడ నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన విజయుడు (అర్జునుడు), పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న చారిత్రక శ్రీ పాశుపతేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆదివారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు మరియు వైదిక కమిటీ సభ్యులు సందర్శించారు.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఉదయం 7:45 గంటలకు దేవస్థానం అర్చకులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి ఈ బృందం కొండపైకి బయలుదేరింది. సుమారు గంటన్నర కష్టతరమైన ప్రయాణం అనంతరం కొండపై మారుమూల ప్రాంతంలో ఉన్న శ్రీ పాశుపతేశ్వర ఆలయంగా భావిస్తున్న పురాతన ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. వారణాసి శైలిలో నాలుగు ద్వారాలతో నిర్మితమై, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ, ప్రధాన ఆలయంతో పాటు రాతి కట్టడంతో శిథిలమైన ఉపాలయాలుగా భావిస్తున్న మరో రెండు నిర్మాణాలను కూడా గుర్తించామని తెలిపారు. పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణ కోసం భక్తుల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో, ఈ క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్ వారికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహాభారతంలోని వనపర్వం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధానికి ముందు దివ్యాస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో పరమశివుడు కిరాతుడి (బోయవాడు) రూపంలో వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేస్తారు. అర్జునుడి పరాక్రమానికి మెచ్చిన శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు.
ఈ మహా ఘట్టానికి గుర్తుగా ఇక్కడ వెలసిన శివలింగాన్ని అర్జునుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి చారిత్రక సాక్ష్యంగా 7వ లేదా 8వ శతాబ్దానికి చెందిన 'కిరాతార్జునీయ' శిలాశాసనం కూడా ఇదే విషయాన్ని వివరిస్తోంది.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు మరియు వైదిక కమిటీ సభ్యులు శ్రీ కోట రవికుమార్, అర్చకులు, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.




