Penamaluru: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: ఎస్పీ!

Penamaluru: తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి ఫలితాల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 14 Nov 2026 6:21 PM IST
Penamaluru
X

Penamaluru: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: ఎస్పీ!

కృష్ణా జిల్లా, పెనమలూరు: తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ సూచించారు.

ఈ సందర్భంగా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలను ఆయన వివరించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలనుకునే వారు ముందస్తుగా సంబంధిత పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచార సమయంలో ఇతర రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించరాదని, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం నిషేధమని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులను పంపిణీ చేయకూడదని హెచ్చరించారు.

అలాగే అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని, నిర్ణీత సమయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రచారంలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, పోస్టర్లను తొలగించడం లేదా ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈరోజు నుండి ఎలక్షన్ ఫలితలవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru