Gudivada: గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు రాఖీలు కట్టిన మహిళలు!

Gudivada: గుడివాడలో రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉత్సాహంగా పాల్గొన్నారు; మహిళలు ఆయనకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 11:13 AM IST
Gudivada
X

Gudivada: గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు రాఖీలు కట్టిన మహిళలు!

Gudivada: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా గుడివాడ రాజేంద్రనగర్ లోని స్వగృహంలో బ్రహ్మకుమారిస్ సంస్థ సభ్యులు సోదరి శైలజ మరియు పలువురు కూటమి మహిళా నాయకులు ఎమ్మెల్యే రాముకు రాఖీలు కట్టారు.

రూరల్ మండలం మోటూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు అక్కడి మహిళలు ఆత్మీయంగా రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. రాఖీ కట్టిన మహిళలతో ఎమ్మెల్యే రాము ఆప్యాయంగా మాట్లాడి వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే చిన్నారులు, యువత ఎమ్మెల్యే రాము వద్ద ఆశీస్సులు తీసుకోగా... పెద్దలు, వయసులో పెద్దవారైన మహిళలను ఎమ్మెల్యే రాము పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయత, అనురాగాల మధ్య సందడిగా సాగాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ మన కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మరింత పెంపొందించే పవిత్రమైన పర్వదినమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు.

రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, సోదరసోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక అని అన్నారు. కుటుంబ బంధాలు బలపడితే సమాజంలో కూడా ఆత్మీయత, మానవతా విలువలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.

రక్షాబంధన్ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల జీవితాల్లో ఆరోగ్యం, సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రేమానుబంధాలు, ఆత్మీయత, పరస్పర సహకారం మరింత పెంపొందించుకుని సహోదర భావంతో సమాజం ముందుకు సాగాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.

ఈ రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. మరోమారు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story