Vijayawada: ప్రజారోగ్య పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యత: విజయవాడ మేయర్ వంగవీటి రాధా!
Vijayawada: విజయవాడ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధా, ప్రజారోగ్య పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా 'మిషన్ హెల్తీ విజయవాడ' ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
Vijayawada: ప్రజారోగ్య పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యత: విజయవాడ మేయర్ వంగవీటి రాధా!
Vijayawada: ప్రజారోగ్య పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యతని, విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ వంగవీటి రాధా అన్నారు.శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), శాసనసభ్యులు గద్దె రామమోహన్, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేయర్ వంగవీటి రాధా ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా రూపొందించిన “మిషన్ హెల్తీ విజయవాడ” కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై తన ప్రథమ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.ఈ కార్యాచరణలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కూడళ్లు, ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా రోడ్లను శుభ్రపరచడం, మురుగునీరు, వర్షపు నీటి కాలువల్లో పూడికతీత పనులు నిర్వహించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడటం, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, తేలియాడే చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపడతారని అన్నారు.
అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ స్థాయిలో, పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. నగరంలోని అన్ని శ్మశానవాటికలు ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టి మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులు కల్పిస్తారని అన్నారు.హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఆహార తయారీ, నిల్వ, పరిసరాల పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలిస్తారని అన్నారు. ఆర్.ఓ. వాటర్ ప్లాంట్లలో నీటి నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ ప్రమాణాలను తనిఖీ చేస్తారని, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలు, నిల్వ, వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటారని, వాణిజ్య సంస్థల్లో ట్రేడ్ లైసెన్సుల తనిఖీలు నిర్వహించి లైసెన్సుల చెల్లుబాటు, నిబంధనల అమలును పరిశీలిస్తారని అన్నారు.
దోమల నివారణకు ప్రాధాన్యతనిస్తూ దోమల ఉత్పత్తి కేంద్రాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు (ALO), సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కార్యక్రమాలను విస్తృతం చేస్తారు. అవసరమైన ప్రాంతాల్లో దోమతెరల పంపిణీ చేపట్టి, దోమల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా జంతు సంక్షేమ మార్గదర్శకాలకు అనుగుణంగా కుక్కల స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నిర్దేశిత కుక్కల ఆహార పంపిణీ ప్రాంతాలను పటిష్టంగా నిర్వహిస్తారని తెలిపారు.ఈ నెల రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచి, ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని మేయర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.




