Pamarru: ఇంధన కొరతపై పుకార్లు నమ్మవద్దు.. మంత్రి పార్థసారథి క్లారిటీ
Pamarru: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
Pamarru: ఇంధన కొరతపై పుకార్లు నమ్మవద్దు.. మంత్రి పార్థసారథి క్లారిటీ
Pamarru: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత ఉందంటూ కొందరు కావాలనే పుకార్లు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కల్పిస్తున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఇలాంటి లేనిపోని ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వంపై అపోహలు కల్పించేందుకు నెగటివ్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం, పరిశ్రమలు వేగంగా స్థాపించబడుతుండటాన్ని జీర్ణించుకోలేక ఈ తరహా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని తెలిపారు. గూగుల్ సంస్థ కూడా త్వరలో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన సంకేతమని పేర్కొన్నారు.
డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించిన మంత్రి, కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలు భయపడి అధికంగా కొనుగోలు చేయడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడిందని, ఇది తాత్కాలికమేనని చెప్పారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం కొనసాగిస్తూ సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ డీజిల్, పెట్రోల్ సరఫరాపై సమీక్ష చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్టాక్ అవుట్ అయిన పెట్రోల్ బంకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, త్వరలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు.
రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. మొక్కజొన్న రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, స్పందన వచ్చిన వెంటనే చర్యలు చేపడతామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.
పొగాకు, కోకో, మామిడి వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థల అభివృద్ధికి O&M నిధులు కేటాయించి టెండర్ల ద్వారా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని వివరించారు.
చిత్తూరు జిల్లా వి.కోటలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని కూడా మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారిపై దాడులు అనాగరికమని అన్నారు.చివరగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పెట్రోల్, డీజిల్పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పానిక్ పర్చేస్లు చేయవద్దని మంత్రి పార్థసారథి కోరారు. ప్రభుత్వం సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.




