Gudivada; గుడివాడ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష!

Gudivada: గుడివాడ అభివృద్ధిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష; 30 ఏళ్ల తాగునీటి సమస్య లేకుండా అమృత్ 2.0 నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 8 Oct 2026 4:48 PM IST
Gudivada
X

Gudivada; గుడివాడ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష!

Gudivada; గుడివాడ పట్టణానికి మంజూరైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వహణ, పనుల పురోగతిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, పబ్లిక్ హెల్త్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ కమిటీ నిపుణులు, మెగా సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

పట్టణంలో చేపట్టనున్న వాటర్ వర్క్స్, నూతన పైప్‌లైన్ల నిర్మాణం, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులపై ఎమ్మెల్యే రాము అధికారులతో చర్చించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా తాగునీటిని సరఫరా చేసే విధంగా రూపొందించిన సమగ్ర డిజైన్‌ను పీడీఎంఎస్ నిపుణులు టి.ఆంజనేయులు ఎమ్మెల్యే రాము, అధికారులకు వివరించారు.

పట్టణ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి వసతులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గుడివాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు కూడా నాణ్యమైన తాగునీరు అందేలా ప్రణాళికలను రూపొందించామని అధికారులు వివరించారు.

అదేవిధంగా బేతవోలు, నాగవరప్పాడు చెరువుల ఆధునీకరణకు సంబంధించి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు, పీడీఎంఎస్ నిపుణులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన అనంతరం పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. రైల్వే గేట్ల వద్ద పైప్‌లైన్ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

పట్టణంలో ఇప్పటికే ప్రారంభించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, భవిష్యత్‌లో నిర్మించనున్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో పాటు ఇతర అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ పట్టణంలో తాగునీటి వసతులను మరింత మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 కింద రూ.22.50 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటు స్థలాల ఎన్టీఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు రూ.10.90 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

అదేవిధంగా గుడివాడ పట్టణంలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి మరో రూ.36 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.

గుడివాడ పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. ముఖ్యంగా పట్టణ నలుమూలలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కూడా తాగునీటి వసతులు అందేలా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రాబోయే 30 ఏళ్ల వరకు గుడివాడ పట్టణంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా సమగ్రంగా డిజైన్ రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభాతో పాటు భవిష్యత్‌లో పెరిగే జనాభా, కొత్తగా అభివృద్ధి చెందే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.

నిధులు మంజూరైనప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, స్థానికంగా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల కారణంగా కొన్ని అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే రాము తెలిపారు. పనులు ప్రారంభించిన తర్వాత ఎలాంటి అవరోధాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

అందుకే పనులు ప్రారంభించే ముందే ఎదురయ్యే సాంకేతిక, స్థానిక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపుతున్నామని వివరించారు. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో పనిని ప్రారంభించి, బ్రేక్ లేకుండా పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గుడివాడ పట్టణ సమగ్ర అభ్యున్నతికి అందుబాటులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఇతర వనరులను కూడా పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు తదితర మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి గుడివాడ పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ ప్రవీణ్, డి ఈ పాండురంగ, మున్సిపల్ ఎం.ఈ సతీష్ చంద్ర,APGBC జోనల్ మేనేజర్ బేబీ, డి.ఈ రాజేంద్రప్రసాద్, ఏ.ఈ కిషోర్,జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,నాయకులు లింగం ప్రసాద్, రామిదేని వేణుబాబు, బొంబాయి శీను, కంచర్ల సుధాకర్, మెగా సంస్థ మేనేజర్ పాండియన్,పీ.డి.ఎం.ఎస్. నిపుణులు, మున్సిపల్ ఏఈలు, పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.