Nandigama: కొణతాలపల్లి సచివాలయం మార్పుపై ఆగ్రహం రీ-షిఫ్ట్ చేయాలని డిమాండ్!
Nandigama: కొణతాలపల్లిలో రూ.43 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని పంచాయతీకి మార్చడంపై నిరసన. పాత భవనంలోనే విధులను కొనసాగించాలని విలేకరుల సమావేశంలో డిమాండ్.
Nandigama: కొణతాలపల్లి సచివాలయం మార్పుపై ఆగ్రహం రీ-షిఫ్ట్ చేయాలని డిమాండ్!
నందిగామ: వీరులపాడు మండలం లోని కొణతాల పల్లి గ్రామంలో అధికార పార్టీ మండల నాయకుడు చెబితే సచివాలయ భవనాన్ని మారుస్తారా అధికారులకు ప్రజల అవసరాలు పట్టవా అధికారుల పర్యవేక్షణలోనే భవన నిర్మాణం పూర్తి మండలంలో అధికారులు ఉన్నారా? లేరా? తక్షణమే పాత సచివాలయ భవనంలోనే ఉద్యోగుల విధులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన...
ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని అధికార పార్టీ నాయకుడు ఆదేశాలతో అధికారులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే సచివాలయ భవనాన్ని పంచాయతీ కార్యాలయానికి మార్చటం దుర్మార్గమైన చర్య అని మండల పార్టీ కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, మాజీ జెడ్పిటిసి సభ్యులు కోటేరు ముత్తారెడ్డి అన్నారు.
వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో కొణతాలపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని పంచాయతీ కార్యాలయానికి మార్చటానికి నిరసిస్తూ గ్రామ వార్డు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొణతాలపల్లి గ్రామంలో 2020 సంవత్సరంలో ప్రజల అవసరాల దృష్ట్యా అందరి ఆమోద యోగ్యంతో 43 లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మించారు.
గ్రామాభివృద్ధిలో తన కుటుంబం కూడా ఉండాలని గ్రామానికి చెందిన గుడిసె బ్రహ్మయ్య తనకున్న ఐదు సెంట్ల నివేశన స్థలాన్ని సచివాల భవనానికి తన కుటుంబ సభ్యులు సహకారంతో విరాళంగా అందించటం ఎంతో అభినందనీయమన్నారు. అధికారుల పర్యవేక్షణలోనే సచివాలయ భవన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.
దీనికి సంబంధించి క్వాలిటీ అధికారులు సైతం భవన నిర్మాణం ఎటువంటి లోపాలు లేవని సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్ మండల అధికారులకు హుకుం జారీచేసి తక్షణమే సచివాలయంలో ఉన్న సామాగ్రి మొత్తం పంచాయతీ కార్యాలయానికి మార్చాలని ఆదేశించటం జరిగిందన్నారు.
దీంతో అధికారులు మొత్తం సచివాలయంలో ఉన్న సామాగ్రిని టాక్టర్ పై తరలించి ఎంతో ఇరుకుగా ఉండే చిన్న పంచాయతీ కార్యాలయంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం కూర్చునేందుకు సరిపడా స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ భవనం వద్దకు రావాలంటే సుమారు కిలోమీటర్ పైన ఉండటంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న మండల అధికారులు సచివాలయ భవనాన్ని తరలించడానికి గల కారణాలను చెప్పేందుకు సైతం ముందుకు రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరికీ ఆమోద యోగ్యమైన గతంలో ఉన్న సచివాలయ భవనాన్ని యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఐలూరి నర్సిరెడ్డి, జానకిరామ్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.




