Pedana: పెడన పట్టణాభివృద్ధికి రూ.12 కోట్లు: కలెక్టర్ డీకే బాలాజి

Pedana: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద పెడన మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. కలెక్టర్ డీకే బాలాజి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పనులను ప్రారంభించారు.

Reddy, Pedana
Published on: 22 Sept 2026 8:47 PM IST
Pedana
X

Pedana: పెడన పట్టణాభివృద్ధికి రూ.12 కోట్లు: కలెక్టర్ డీకే బాలాజి

కృష్ణాజిల్లా పెడన: రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం కడపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

ఇందులో భాగంగా పెడన పురపాలక సంఘ పరిధిలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) కింద మంజూరైన రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పెడన పట్టణం బ్రహ్మపురం రోడ్డులోని దేవాంగ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్‌తో కలిసి వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెడన పట్టణ పరిధిలో ఒకేసారి సుమారు రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం పట్టణ అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రోడ్డు విస్తరణ, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం తదితర మౌలిక వసతుల పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

పట్టణాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వం, మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు సమకూర్చి రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతులు కల్పించగలదని, అయితే వాటిని పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉంటుందన్నారు. సింగపూర్ నగరం పరిశుభ్రత, క్రమశిక్షణతో అభివృద్ధి చెందిన తీరును ఉదాహరణగా పేర్కొంటూ ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే పట్టణాలను మరింత సుందరంగా తీర్చిదిద్దవచ్చన్నారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, రోడ్లపై చెత్త వేయకపోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న మార్పులను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల డ్రైన్లు పూడుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, దోమలు పెరగడం వంటి సమస్యలు తలెత్తడంతో పాటు కొత్తగా నిర్మించిన రోడ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు.

రూ.12 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున రోడ్లకు అడ్డంగా ఉన్న మెట్లు, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి వస్తే ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సీసీ రోడ్లకు అవసరమైన క్యూరింగ్ ప్రక్రియను కాంట్రాక్టర్లు సక్రమంగా చేపడుతున్నారా లేదా ప్రజలు కూడా పర్యవేక్షించాలని సూచించారు. రోడ్డు నాణ్యతగా నిర్మించబడి, దీర్ఘకాలం మన్నేలా చేయడంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమన్నారు.

పెడన పట్టణానికి నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, అంచనాలు రూపొందించి పనులకు అనుమతులు వచ్చేలా కృషి చేసిన పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.

కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డిఓ కే సాంబశివరావు, పబ్లిక్ హెల్త్ డిఈ ప్రవీణ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు వేణు గోపాల్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana