Penamaluru: లారీ షెడ్‌లో డ్రైవర్ హత్య కేసు నిందితుడి అరెస్ట్
Penamaluru: పెనమలూరు ఆటోనగర్ లారీ షెడ్‌లో మద్యం మత్తులో జరిగిన గొడవలో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Penamaluru: లారీ షెడ్‌లో డ్రైవర్ హత్య కేసు నిందితుడి అరెస్ట్
పెనమలూరు: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు నవతార్ రోడ్, ఆటోనగర్‌లో ఉన్న రమణ మిస్త్రీ లారీ షెడ్ వద్ద 30.08.2026 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ సర్కార్, వయస్సు 50 సంవత్సరాలు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ, భీమవరం ప్రాంతానికి చెందిన లారీని మరమ్మతుల నిమిత్తం 05.08.2026 నుండి కానూరు నవతార్ రోడ్డులోని రమణ మిస్త్రీ లారీ షెడ్ వద్ద నిలిపి రిపేర్ చేయించుకుంటున్నాడు.
ఈ క్రమంలో లారీ రిపేర్ పనుల్లో సహాయం చేయడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సంజయ్ హల్దార్, వయస్సు 36 సంవత్సరాలు, లారీ క్లీనర్‌గా పనిచేస్తూ 19.08.2026న సదరు లారీ షెడ్ వద్దకు వచ్చి ఆనంద్ సర్కార్‌తో కలిసి అక్కడే ఉంటున్నాడు. లారీ రిపేర్ పనులు పూర్తయ్యే వరకు ఇద్దరూ రాత్రి సమయాల్లో సదరు షెడ్ వద్దనే నిద్రిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో 30.08.2026 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో, ఆనంద్ సర్కార్ మరియు సంజయ్ హల్దార్ మద్యం సేవించిన అనంతరం వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సంజయ్ హల్దార్ అక్కడ ఉన్న ఇనుప పైపుతో ఆనంద్ సర్కార్ ముఖం మరియు తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై, ఆనంద్ సర్కార్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ఈ సంఘటనపై లారీ షెడ్ మిస్త్రీ రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.517/2026 U/s 103(1) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు మరియు విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా నిందితుడైన సంజయ్ హల్దార్, వయస్సు 36 సంవత్సరాలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వ్యక్తిని 02.09.2026 సాయంత్రం సుమారు 5:00 గంటలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి
ఈ సంఘటనలో మద్యం సేవించిన అనంతరం జరిగిన స్వల్ప వాగ్వాదం చివరకు హత్యకు దారితీసి ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి గొడవలకు పాల్పడటం వల్ల తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
అదేవిధంగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పనిలో నియమించుకునే యజమానులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు వారి ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల వివరాలను తప్పనిసరిగా సేకరించి నమోదు చేసుకోవడంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కనీసం రెండు ఫోన్ నంబర్లను కూడా నమోదు చేసి భద్రపరచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రజల భద్రత మరియు నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పెనమలూరు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కేసులో చనిపోయిన వ్యక్తి మరియు ముద్దాయి యొక్క పూర్తి వివరాలు ప్రారంభ దశలో తెలియకపోయిన, వారిని గుర్తించడంలో మరియు ముద్దాయిని అరెస్టు చేయడంలో చొరవ చూపి శ్రమించిన పెనమలూరు ఇన్స్పెక్టర్ N. వెంకట నారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు సత్య సుధాకర్, రమేష్, వెంకటేశ్వర రావు, ప్రసాద్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు అభినందించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు.




