Tiruvuru: తిరువూరు అభివృద్ధికి కూటమి ఐక్యత బలం

Tiruvuru: తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పర్యటన; గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ హామీ, కూటమి విజయోత్సవ సభలో ట్రిపుల్ ఇంజిన్ పాలనపై కీలక వ్యాఖ్యలు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 23 Nov 2026 10:13 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరు అభివృద్ధికి కూటమి ఐక్యత బలం

తిరువూరు: విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తిరువూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత తిరువూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు త్వరలోనే పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం తిరువూరులోని బోసు బొమ్మ సెంటర్‌లో తిరువూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ కోట పుల్లమ్మ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, తిరువూరు మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ హుస్సేన్,, కృష్ణాజిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెస్ బేగ్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. తిరువూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లుగా బాధ్యతలు స్వీకరించిన నూతన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

తిరువూరు నియోజకవర్గంలో యువ నాయకత్వం ఆవిర్భవించడం శుభపరిణామమని, రాబోయే మూడు దశాబ్దాల రాజకీయ, సామాజిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వ స్ఫూర్తితో యువ నాయకులు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ప్రజాప్రతినిధులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారాన్నే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పదవులు బాధ్యతను పెంచుతాయని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఉన్న సమన్వయం, ఐక్యత, కార్యకర్తల సమష్టి కృషి కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాలను సాధించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని, కీలక పదవులను కైవసం చేసుకోవడం ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు.

తిరువూరు నియోజకవర్గంలో కూటమి నాయకుల సమన్వయం, కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఈ విజయ పరంపరను అభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ కొనసాగించాలని అన్నారు. మహిళా నాయకత్వానికి కూటమి సముచిత ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమని, తిరువూరు నియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి దక్కడం ఈ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, స్థానిక సంస్థల్లోనూ కూటమి విజయం సాధించడంతో కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల సమన్వయంతో కూడిన ట్రిపుల్ ఇంజిన్ పాలన ద్వారా మరింత వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.

ఈ విజయానికి సహకరించిన కూటమి అగ్రనేతలకు, ఎన్టీఆర్ జిల్లా నాయకులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, తిరువూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తిరువూరును అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

*కూటమి ఐక్యత, యువ నాయకత్వం, ప్రజా సంక్షేమం, సమష్టి కృషితో తిరువూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని ఉద్ఘాటించారు.*

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru