Uyyuru: డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Uyyuru: ఉయ్యూరులో డయేరియా బాధితులను పరామర్శించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచన.
Uyyuru: డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలోని హరిజనవాడ, కాపుల రామాలయం వీధుల్లో గత రెండు రోజులుగా విరోచనాలు,వాంతులతో డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న స్థానికులను పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పరామర్శించారు,అనంతరం మున్సిపల్ అధికారులు,వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు,మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాబు రాజేంద్రప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ,ఉయ్యూరులో నమోదవుతున్న డయేరియా కేసులకు అసలు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలిస్తున్నారని తెలిపారు, ఇప్పటివరకు నీటి కాలుష్యమే కారణమని నిర్ధారించే ఆధారాలు లభించలేదని, పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని చెప్పారు,ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో నీటిలో బ్యాక్టీరియా కలుషితం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని వెల్లడించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా వెంటనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించామని తెలిపారు,ప్రధాన పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ,తాగునీటి సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
డయేరియా వ్యాప్తికి వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు,ముఖ్యంగా బయట లభించే స్ట్రీట్ ఫుడ్ వంటి అంశాలు కారణమయ్యే అవకాశాలపైనా అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు, ఉయ్యూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అసలు కారణాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు వైద్య,ఆరోగ్య,మున్సిపల్,ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ గారు,మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పి. నారాయణ గారు ఇప్పటికే పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారని ఎమ్మెల్యే తెలిపారు,గుడివాడ నుంచి అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొచ్చి ఉయ్యూరులోని వివిధ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్,శానిటేషన్,డ్రైనేజీ శుభ్రత వంటి చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు.
వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు,కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య,మున్సిపల్,పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని చెప్పారు.
డీఎంహెచ్ఓను ఉయ్యూరుకు వచ్చి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించామని,ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలోని ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారని తెలిపారు, ఆహారం లేదా నీటి వనరు కలుషితమైనట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా వ్యవస్థను సిద్ధం చేశామని చెప్పారు.
అదేవిధంగా పట్టణంలో అనారోగ్య పరిస్థితుల్లో కనిపిస్తున్న వీధి కుక్కల అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు,వాటి ద్వారా ఏమైనా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందా అనే విషయాన్ని పశువైద్య అధికారులతో కలిసి పరిశీలించి,అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాబు రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ,ఉయ్యూరులో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి,అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు,ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు,వైద్య సిబ్బంది పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు,కారణం ఏదైనా సరే,దాన్ని త్వరితగతిన గుర్తించి పరిస్థితిని పూర్తిగా నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ప్రజలు కూడా పరిశుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించాలని,బయట ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు, ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం,భద్రత విషయంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,మున్సిపల్ అధికారులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




