Nandigama: వృద్ధురాలిపై దాడి చేసి నానుతాడు దోపిడీ.. నిందితుడి అరెస్ట్!
Nandigama: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో గేదెలు మేపుతున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నానుతాడు లాక్కెళ్లిన నిందితుడు తన్నీరు కార్తీక్‌ను నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు.
Nandigama: వృద్ధురాలిపై దాడి చేసి నానుతాడు దోపిడీ.. నిందితుడి అరెస్ట్!
నందిగామ: వీరులపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా గేదెలు మేపుకుంటున్న వృద్ధ మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు నానుతాడును బలవంతంగా లాక్కొని పరారైన ఘటన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
12.09.2026 తేదీన ముద్దాయి తన్నీరు కార్తీక్, వయస్సు 26 సంవత్సరాలు,గూడెం మాధవరం గ్రామం, వీరులపాడు మండలం, వృద్ధ మహిళ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి, జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆమెపై దాడి చేశాడు. ముఖాన్ని కప్పుకొని, రోడ్డుపక్కన ఉన్న రాయితో ఆమె తలపై కొట్టి, ఆమె మెడలోని బంగారు నానుతాడును లాక్కొని మోటార్ సైకిల్‌పై అక్కడి నుండి పరారయ్యాడు.
సంఘటన అనంతరం ప్రారంభ దశలో ముద్దాయి గురించి స్పష్టమైన క్లూలు ఏవీ లేకపోవడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, ముద్దాయి వెళ్లిన మార్గం, ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు అతని కదలికలను గుర్తించారు.
అదేవిధంగా స్థానికంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి, అనుమానితుల కదలికలు, సంఘటనకు ముందు మరియు తరువాత వారి కార్యకలాపాలు, ప్రయాణ మార్గాలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు ఫుటేజీలు, స్థానిక సమాచారం మరియు ఇతర దర్యాప్తు ఆధారాలను సమన్వయం చేస్తూ ముద్దాయి ఆచూకీని గుర్తించారు.
ఈ క్రమంలో 14.09.2026 సాయంత్రం సుమారు 06:00 గంటలకు పెద్దాపురం ఆంధ్రా బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద ముద్దాయి తన్నీరు కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు నానుతాడును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ఛేదనలో సిబ్బంది చూపిన ప్రతిభ, అంకితభావం మరియు సమన్వయ కృషిని గుర్తించిన సీఐ నందిగామ రూరల్ వైవివిఎల్ నాయుడు సంబంధిత సిబ్బందిని అభినందించి, వారికి రివార్డులు అందజేశారు. సిబ్బంది కృషిని ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు.
అరెస్టు అనంతరం ముద్దాయికి వైద్య పరీక్ష నిర్వహించి, అవసరమైన చట్టపరమైన విధివిధానాలను పూర్తి చేసి, అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వారి కోర్టు, నందిగామ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.




