Vuyyuru: పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి - కలెక్టర్ డికె బాలాజీ
Vuyyuru: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని యువత, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ పిలుపునిచ్చారు.
Vuyyuru: పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి - కలెక్టర్ డికె బాలాజీ
వుయ్యూరు: వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని యువత, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ అన్నారు.
వివిధ ప్రభుత్వ పథకాల కింద ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక, స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. వుయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన PMEGP పథకం కింద సిరామిక్ డెంటల్ టీత్ తయారీ యూనిట్, అలాగే తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలోని PMFME, DWCRA పథకాల ఆర్థిక సహకారంతో అభివృద్ధి చెందిన “ఆహార మందిర్ – మిల్లెట్ హౌస్ & హోమ్ ఫుడ్స్” యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియ, మార్కెటింగ్, ఉపాధి కల్పన తదితర అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
PMEGPతో తయారీ రంగంలో అడుగు
వుయ్యూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిరామిక్ డెంటల్ టీత్ తయారీ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. యూనిట్‌లో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలు, మౌల్డ్స్, ముడి పదార్థాలతో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.
B.D.S. విద్యను పూర్తి చేసిన యువ పారిశ్రామికవేత్త తయారీ రంగంలో స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో సిరామిక్ డెంటల్ టీత్ తయారీ యూనిట్‌ను స్థాపించారు. PMEGP కింద రూ.40 లక్షల అంచనా వ్యయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 2026లో ప్రారంభమైన ఈ యూనిట్ ద్వారా నిర్వాహకురాలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా 14 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నారు.
యూనిట్‌లో తయారవుతున్న ఉత్పత్తులకు కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుండటంతో, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచి వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులతో “ఆహార మందిర్” విజయగాథ
అనంతరం తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన ఝాన్సీ గ్రూప్ సభ్యురాలు నిమ్మగడ్డ విజయ నిర్వహిస్తున్న “Aahara Mandir – Millet House & Home Foods” యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు.
సంప్రదాయ రుచులను కాపాడుతూ, చిరుధాన్యాలతో నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో 2018లో హోమ్ ఫుడ్స్ తయారీని ప్రారంభించారు. అనంతరం సెక్రటేరియట్‌లో స్టాల్ ఏర్పాటు చేసుకుని, SERP ద్వారా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలను విస్తరించారు.
వ్యాపార అభివృద్ధిలో భాగంగా నవంబర్ 2025లో PMFME పథకం ద్వారా రూ.5 లక్షలు, DWCRA ద్వారా రూ.3 లక్షల రుణ సహాయం పొందారు. మొత్తం రూ.8 లక్షలతో అవసరమైన మెషినరీని కొనుగోలు చేయడంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది.
ప్రారంభ దశలో ముగ్గురు సభ్యులు పనిచేయగా, ప్రస్తుతం వ్యాపారం అభివృద్ధి చెందడంతో 7 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలకు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు “Aahara Mandir” బ్రాండ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నిర్వాహకురాలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు – మహిళల ఆర్థిక సాధికారతకు వేదిక
PMEGP, PMFME, DWCRA వంటి పథకాలను మహిళలు, యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన యూనిట్లు విజయవంతంగా కొనసాగుతూ మరికొందరికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు.
వివిధ రంగాల్లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి, మహిళల ఆర్థిక సాధికారతకు, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీ వెంకటరావు, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ హరిహరనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.




