Allagadda: ప్రతి వినతికీ తక్షణ పరిష్కారం చూపాలి.. ఆళ్లగడ్డలో కలెక్టర్ ఆదేశం

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన “వన్ మంత్ – ఫోర్ విజిట్” ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక విజయవంతమైంది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 May 2026 6:26 PM IST
Allagadda
X

Allagadda: ప్రతి వినతికీ తక్షణ పరిష్కారం చూపాలి.. ఆళ్లగడ్డలో కలెక్టర్ ఆదేశం

Allagadda: ప్రజల నుండి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, జాప్యానికి తావులేకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత మూడు వారాలుగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. మొదటి వారం 578, రెండో వారం 524 ఫిర్యాదులు అందగా, ఈ వారం ఇప్పటివరకు దాదాపు 400 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం మూడు వారాల్లో సుమారు 1500 వరకు గ్రీవెన్స్‌లు అందినట్లు పేర్కొన్నారు. వీటిలో సుమారు 400 సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన పెండింగ్ అంశాలను కూడా చివరి వారంలో పూర్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమన్నారు.

మొత్తం 33 శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారుల వారీగా విభజించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయా శాఖల అధికారులు ఆర్డీఓలతో కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులను నేరుగా పిలిపించి, వెబ్‌ల్యాండ్ ధృవీకరణ పత్రాలు, ఎండార్స్‌మెంట్ కాపీలు తదితర ఆధారాలను వెంటనే అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో తిరస్కరించకుండా, ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖలో 22ఏ డివిజన్లు, డాటెడ్ లైన్స్ క్లియరెన్స్, మ్యుటేషన్లు, రాస్తా సమస్యలు, ఇనాం పట్టా అంశాలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ‘అన్నదాత సుఖీభవ’, ఎరువుల లభ్యత వంటి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీరాజ్, పీడబ్ల్యూడీ, వాటర్ రిసోర్సెస్ శాఖలకు చెందిన మట్టి రోడ్లు, కల్వర్టులు, చిన్న వంతెనల నిర్మాణ ప్రతిపాదనలను త్వరితగతిన ప్రాసెస్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలీస్ శాఖ భూ వివాదాలను పెద్దల సమక్షంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈఓ మరియు సమగ్ర శిక్ష శాఖలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, డెస్కులు, గ్రౌండ్ లెవెలింగ్ వంటి సమస్యలపై సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ బిల్లుల విడుదల, శానిటేషన్, తాగునీటి సమస్యలు, వైద్యుల కొరత వంటి అంశాలపైనా సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజా గ్రీవెన్స్‌లను అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగుతుందని, వచ్చే వారంలో కొత్త అర్జీల స్వీకరణకు పరిమిత సమయం కేటాయించి, ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఫీల్డ్ విజిట్ ఫోటోలు, లబ్ధిదారుల అభిప్రాయాలను సీఎం డ్యాష్‌బోర్డుకు పంపిస్తామని చెప్పారు.

అధికారులు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తోందని, అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధికి మరింత నిధులు సాధించే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చివరగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు మరియు అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story