Atmakur: గర్భాలయంలో మూలవిరాట్టు ఫోటోలపై దేవాదాయ శాఖ నిషేధం

Atmakur: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల గర్భాలయాల్లో మూలవిరాట్టు ఫోటోలు తీయడంపై నిషేధం. ఆన్‌లైన్ దర్శనాలు, అర్చకుల వసూళ్లపై ఫిర్యాదులతో దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 1 Aug 2026 6:00 AM IST
Atmakur
X

Atmakur: గర్భాలయంలో మూలవిరాట్టు ఫోటోలపై దేవాదాయ శాఖ నిషేధం

ఆత్మకూరు: రాష్ట్రంలోని ఏ ఆలయాల్లోనూ గర్భాలయంలోని మూల విరాట్యులైన స్వామి, అమ్మవార్లను ఫోటోలు తీయరాదంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను అమలు చేయాలంటూ దేవాదాయ శాఖ ఆలయాల కార్యనిర్వహణాధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని క్షేత్రాలలో ఉత్సవాల సందర్భంగా మూలవిరాట్టు ఫోటోలు వీడియోలు తీసి మీడియాకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల దేవతా విగ్రహాల మహిమ, కళాత్మక ఆకర్షణ తగ్గిపోతుందని ఆగమ శాస్త్ర వేద పండితులు భావిస్తున్నారు.

ఇప్పటికే శ్రీశైలం, తిరుమల, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, సింహాచలం, మహానంది, శ్రీకాళహస్తి, ఆలయాల్లో ఈ నిషేధం అమలవుతుంది. ఇకపై ఈ నిషేధాన్ని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మొదలు మండల స్థాయిలోని ఆలయాల వరకు వర్తిస్తుందని , దేవస్థానం ఈవోలు అమలు చేసి తీరవలసిందేనని ఆదేశించారు.

ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాల్లో దేవాదాయ శాఖ వీఆర్వో విభాగం గర్భాలయ మూల విరాట్టు దేవతామూర్తులను ఫోటోలు తీయకుండా ఉత్సవ విగ్రహాలను మాత్రమే మీడియా ప్రచారానికి వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లమల లోని ప్రాచీన ఆలయాలు, క్షేత్రాల గర్భాలయ మూలవిరాట్టు దేవతామూర్తులను కొందరు అర్చకులే నిత్యం ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాలలో తమ వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా భక్తులకు వసతి, ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించాలని వ్యక్తిగత ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఇదేమని ప్రశ్నిస్తే.. రాజకీయ ప్రముఖుల వర్గాల పేరు చెప్పుకొని ప్రశ్నించిన భక్తులనే కొందరు అర్చకులు బెదిరిస్తున్నారు. మరికొన్ని ఆ ఆలయాల్లో నిత్యం దేవతామూర్తుల అలంకరణలను పరిచారకులు ఫోటోలు తీసి ధనవంతులైన భక్తులకు పంపి వారి పేరు పై అర్చన అభిషేకాలు చేయించామని ఫోన్ పే ల ద్వారా డబ్బు దండుకుంటున్నారు.

మరికొందరు యువ పరిచారకులు స్వామి అమ్మవార్లను వీడియో కాల్స్ ద్వారా దర్శనం చేస్తున్నారు. ఈ రకమైన దోపిడి నంద్యాల జిల్లా నల్లమల లోని ప్రముఖ ప్రాచీన ఆలయాలలో మితిమీరిపోవడంతో బాధిత భక్తులు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

భక్తుల ఆరోపణలు, ఫిర్యాదులతో .. ప్రాచీన ఆలయాలు, క్షేత్ర తీర్థాలలో రహస్య విచారణ జరిపిన దేవదాయ శాఖ రాష్ట్రంలోని అన్ని హిందూ ఆలయాల గర్భగుడి మూలవిరాట్టు దేవతమూర్తుల ఫోటోలు తీయడాన్ని నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఈ నిబంధనలు ఏమాత్రం అమలవుతాయో అనే అభిప్రాయాలను భక్తులు వెల్లడిస్తున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story