Kurnool: ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: ఏపీ రైతు సంఘం డిమాండ్!

Kurnool: తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన కర్నూలు జిల్లా రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

M Jagadeesh
Published on: 8 Sept 2026 7:24 PM IST
Kurnool
X

Kurnool: ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: ఏపీ రైతు సంఘం డిమాండ్!

Kurnool: అరకొర వర్షాలను నమ్ముకుని రైతులు పత్తి, కంది, వేరుశనగ, ఉల్లి, ఆముదం, జొన్న తదితర పంటలను సాగు చేశారని తెలిపారు. మూడు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని అన్నారు.

కరువు పరిస్థితులు కళ్లముందే కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.పూర్తిగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం, రైతుల వ్యవసాయ రుణాల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతులు చెల్లించిన పంట బీమా ప్రీమియం తిరిగి చెల్లింపు, ఇకపై ప్రభుత్వమే పంట బీమా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరువు కారణంగా పశువులకు మేత కొరత ఏర్పడుతున్నందున ఉచితంగా పశుగ్రాసం అందించాలని, కరువు ప్రభావిత రైతు కుటుంబాలకు 10 నెలల పాటు నెలకు రూ.20 వేల కరువు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలని, ప్రత్యామ్నాయ పంటల కోసం ఉచిత విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదే డిమాండ్లతో దేవనకొండలోనూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, మండల కార్యదర్శి ఎం. నరసరావు మాట్లాడుతూ.. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతుల అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులు చెల్లించిన పంట బీమా ప్రీమియంను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని, కరువు ప్రభావిత రైతు కుటుంబాలకు నెలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అనంతరం పత్తికొండ, దేవనకొండ తహసీల్దార్లకు నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

M Jagadeesh

M Jagadeesh