Atmakur: శ్రీశైలం జల సంరక్షణపై చర్యలు చేపట్టాలి బొజ్జా విజ్ఞప్తి!
Atmakur: కరువు కోరల్లో రాయలసీమ.. శ్రీశైలం జల సంరక్షణపై తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా లేఖ.
Atmakur: శ్రీశైలం జల సంరక్షణపై చర్యలు చేపట్టాలి బొజ్జా విజ్ఞప్తి!
ఆత్మకూరు: తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో తాగునీరు, పశువుల తాగునీరు, ఆరుతడి పంటలకు కనీస లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణలో జల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు.
ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ.. కృష్ణా జలాల నిర్వహణలో శ్రీశైలం జలాశయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో జాతీయ జల విధానం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014, బచావత్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి ప్రకారం తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, తదుపరి పశువుల తాగునీరు, అనంతరం ఆరుతడి పంటలకు కనీస లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.
గత వర్షాకాలంలో శ్రీశైలం జలాశయానికి 2,000 టీఎంసీలకు పైగా వరద జలాలు వచ్చినప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి పేరుతో పెద్దఎత్తున నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల జల సంరక్షణకు భంగం కలిగిందని, దాని ప్రభావమే ప్రస్తుతం రాయలసీమ ఎదుర్కొంటున్న తీవ్రమైన తాగునీటి, సాగునీటి సంక్షోభానికి ప్రధాన కారణమని అన్నారు.
గా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రాధాన్యత చర్యలు చేపట్టాలని సమితి డిమాండ్ చేసింది. మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు వెంటనే కృష్ణ వరదనీటిని విడుదలచేయాలని కోరింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ, గాలేరు–నగరి ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గ్రామీణ చెరువులకు తక్షణమే నీటిని విడుదలకు ప్రభుత్వం తేదీలను ప్రకటించాలన్నారు.
తాగునీరు, పశువుల తాగునీరు, ఆరుతడి పంటలకు అవసరమైన కనీస లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేలా ప్రణాళికలు ఎప్పుడు రూపొందిస్తారని ప్రశ్నించారు.
కృష్ణా డెల్టా అవసరాల కోసం పట్టిసీమ, పులిచింతల వంటి ప్రత్యామ్నాయ నీటి వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగిస్తూ, శ్రీశైలం జలాశయం నుంచి అనవసర నీటి విడుదలను తగ్గించాలని సమితి సూచించింది. ప్రతి టీఎంసీ నీటిని భవిష్యత్ తాగునీటి అవసరాలు, కరువు పరిస్థితులు, రాయలసీమకు చట్టబద్ధంగా కేటాయించిన జలహక్కులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా నిర్వహించాలని కోరింది.
రాయలసీమ ప్రజల తాగునీటి భద్రత, పశుసంపద పరిరక్షణ, రైతుల జీవనోపాధి రక్షణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత బాధ్యత అని సమితి పేర్కొంది. "శ్రీశైలం జల నిర్వహణలో జల సంరక్షణే ప్రధాన విధానం" అనే సూత్రాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బొజ్జా విజ్ఞప్తి చేసారు.
"ఈరోజు శ్రీశైలంలో సంరక్షించే ప్రతి టీఎంసీ నీరు రేపటి రాయలసీమ తాగునీటి భద్రతకు, రైతాంగ మనుగడకు, పశుసంపద రక్షణకు, ప్రాంతీయ న్యాయానికి భరోసా అవుతుంది. అందువల్ల కృష్ణా డెల్టాకు ప్రత్యామ్నాయ నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, శ్రీశైలం జలాశయంలో గరిష్ఠ స్థాయిలో జల సంరక్షణ చేపట్టే విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి" అని బొజ్జా దశరథ రామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు.




